కొండపాక, డిసెంబర్ 25: కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ మహిళ.. ఏడాదిన్నర కుమారుడిపై కిరోసిన్ పోసి తగులబెట్టి, ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్లలో శనివారం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో తల్లీకొడుకు మృతిచెందారు. గ్రామానికి చెందిన గవ్వల స్వామి, నవిత (22) దంపతులకు కొడుకు మణిదీప్ (18 నెలలు) ఉన్నాడు. పైండ్లెన కొత్తలో జీవనోపాధికోసం మెదక్ జిల్లా రామాయంపేటలో నివాసం ఉన్నారు. ఏడాది క్రితం గ్రామా నికి వచ్చి వ్యవసాయం చేసుకొంటున్నారు. వారం నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. విషయాన్ని నవిత తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు స్వామికి ఫోన్‌చేసి ఆరా తీయగా దురుసుగా మాట్లాడాడు. కలత చెందిన నవిత.. శనివారం మధ్యాహ్నం భర్త పొలం పనులకు వెళ్లగానే, తనతో పాటు కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించుకొంది. ఇరుగుపొరుగు వెళ్లి చూసేసరికి ఇద్దరు కాలిపోయారు. నవిత తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని విగతజీవులైన కూతురు, మనుమడిని చూసి బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.