గుమ్మడిదల, నవంబర్ 14: తన కొడుకు మృతికి కారణమయ్యారని పట్టపగలు తల్లీకొడుకును నడిరోడ్డుపై ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన బొంతపల్లి పారిశ్రామికవాడలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరభద్రనగర్ కాలనీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాగరాజు కుటుంబసభ్యులు,సరోజాదేవి(50),అనిల్(30) కుటుంబ సభ్యులు పక్కపక్కనే ఉంటున్నారు.
ఏప్రిల్ 4న నాగరాజు కుమారుడు శివాన్స్ (రెండున్నరేండ్లు) ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు. సరోజాదేవి కుమార్తె నేహానే(మానసిక పరిస్థ్ధితి బాగాలేదు), తన కొడుకును సంపులో పడేసి చంపిందని నాగరాజు కుటుంబసభ్యులు అనుమానించారు. గురువారం నాగరాజు ఇంటి ముందు నేహా తిరుగుతుండడంతో ఈమెనే తమ కుమారుడిని చంపిందని దూషించాడు. ఇరుకుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన నాగరాజు బైక్‌పై వెళ్తున్న సరోజాదేవి, అనిల్‌ను కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో వారు అక్కడే ప్రాణాలు వదిలారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను నర్సాపూర్ దవాఖానకు తరలించారు. నిందితుడు నాగరాజును అరెస్టు చేశారు.