శివ్వంపేట, మే 16: బట్టలు ఆరేస్తుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురికాగా, ఆమెను కాపాడబోయి మరిది కొడుకు కూడా విద్యుత్తు షాక్‌కు గురయ్యాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉసిరికపల్లిలో గురువారం జరిగింది. శివ్వంపేట ఎస్సై మహిపాల్‌రెడ్డి, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నీరుడి మణెమ్మ(45) గురువారం ఉదయం బట్టలను ఇంటిముందు ఉన్న దండేనికి (జే-వైర్)పై ఆరేస్తున్నది. కాగా, గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి ఆ వైర్‌కు ఇంటి సర్వీస్ వైర్ తగలడంతో ఆమె విద్యుత్తు షాక్‌కు గురైంది. గమనించిన మణెమ్మ మరిది కొడుకు నీరుడి భానుప్రసాద్ (19) ఆమెను కాపాడేందుకు యత్నించగా అతడికి కూడా షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మణెమ్మ కూతురు శ్రీలత వచ్చి చూసే సరికి వారు కిందపడి ఉన్నారు. వారిని లేపే ప్రయత్నం చేయగా ఆమె కూడా కరెంట్‌షాక్‌కు గురైంది. వెంటనే స్థానికులు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వారిని తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అప్పటికే నీరుడి మణెమ్మ, నీరుడి భానుప్రసాద్ మృతిచెందారు. శ్రీలత స్వల్ప గాయాలతో బయటపడింది.