హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఉదయం, సాయంత్రం వేళల్లో చలిగాలులతోపాటు పొగమంచు దుమ్మటి కప్పుకుంటుంది. చలి తీవ్రత వల్ల 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో సగటు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయని వెల్లడించింది. ఉత్తరభారతం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరిగిందని పేర్కొన్నది. మరో రెండు, మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యంత కనిష్ఠంగా 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది.
సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 6.4, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 6.5, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో 7.7, వికారాబాద్ జిల్లా నవాబ్‌పేటలో 7.8, సిద్దిపేట జిల్లా రాయపోలులో 8.1, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 8.5, కామారెడ్డి జిల్లా గాంధారీలో 8.6, నిర్మల్ జిల్లా పెంబిలో 8.9, నిజామాబాద్ జిల్లా సాలూరలో 9.1, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో 9.4, నారాయణపేట జిల్లా కోస్గిలో 9.8, నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 9.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.