Vande Bharat Train | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలకు త్వరలో మరికొన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ర్టాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం తెలంగాణ నుంచి ప్రతి రోజూ 3 వందే భారత్ రైళ్లు నడిపిస్తున్నారు. సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడుస్తున్న ఈ రైళ్లు ప్రయాణికుల అవసరాలను ఏమాత్రం తీర్చలేక పోతున్నాయి. 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్న ఈ రైళ్లలో ప్రయాణించాలంటే 4 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తున్నది. దీంతో సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ నుంచి పుణె, నాగ్‌పూర్, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు వందే భారత్ రైళ్లను విస్తరించాల్సిన అవసరం ఉన్నదన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. వందే భారత్ రైళ్లకు తెలంగాణలో విపరీతమైన గిరాకీ ఉన్నప్పటికీ కేంద్రం మూడు రైళ్లతోనే సరిపెట్టింది.