జహీరాబాద్, జనవరి 27: ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రూట్లలో మరిన్ని బస్సులు నడిపిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపోను పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జనార్ మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. సంస్థ ఆదాయం పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆదాయం పెరిగిన వెంటనే కార్మికులకు కొత్త పీఆర్సీ అమలు చేసి, డీఏలు చెల్లిస్తామని ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తితో జనవరి నెలలో ఆదాయం తగ్గిందన్నారు. కార్మికులకు సీసీఎల్ రుణాలు మంజూరు చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. కార్మికులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్టు చెప్పారు. సంస్థ ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్న కార్మికులకు ఇన్సెంటివ్ చెల్లిస్తున్నట్టు తెలిపారు.