హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లో నమోదు పెంచేందుకు చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఈ నెల 3న బడిబాట ప్రారంభంకాగా, మూడు రోజుల్లోనే 66,847 వేలకు పైగా చిన్నారులు ప్రవేశాలు పొందారు. రోజుకు 20 వేల చొప్పున విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు. టీచర్లంతా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఇంటింటికి తిరిగి విద్యార్థులను చేర్చుకొంటున్నారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు చేతబట్టుకుని సర్కారు బడుల్లోనే చేరాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి జెడ్పీ స్కూల్లో ఇప్పటికే 1,358 మంది విద్యార్థులుండగా, కొత్తగా 226 మంది విద్యార్థులు చేరారు.