హైదరాబాద్ : రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులు ఐఐటీ, నీట్ ఫలితాల్లో మరిన్ని ర్యాంకులు సాధించేలా గురుకుల పాఠశాలల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.మైనారిటీ గురుకులాల నిర్వహణ, పనితీరుపై శనివారం ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్, విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి షఫీవుల్లాతో కలిసి బంజారాహిల్స్ లోని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మైనారిటీలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 204 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
వీటిలో ఇంగ్లిష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు.ఈ ఏడాది 124 పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామని, వీటి కోసం 48 భవనాలను అద్దెకు తీసుకున్నట్లు షఫీవుల్లా మంత్రికి వివరించారు. ప్రతి శనివారం రెండు గంటలు “పాఠశాల ప్రగతి” పేరిట పరిసరాల పరిశుభ్రత, మొక్కలను నాటడం, వాటికి నీళ్లు పోయడం వంటి పనులు చేపట్టాలని సూచించారు.