నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 4: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ర్టాన్ని వాన ముంచెత్తుతున్నది. ప్రధానంగా హైదరాబాద్, సిద్దిపేటలో కుండపోతగా కురుస్తున్నది. ఎడతెరిపి లేకుండా బీభత్సం సృష్టిస్తున్నది. ప్రధాన రహదారులు జలమయం కాగా, ముంపు కాలనీల్లోకి వరద నీరు చేరుతున్నది. శనివారం అత్యధికంగా సిద్దిపేట జిల్లా కొండపాక, తిమ్మారెడ్డిపల్లెలో 11 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్టు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) తెలిపింది. సైదాబాద్‌లోని కుర్మగూడలో 9.8 సెంటీమీటర్లు నమోదైంది. హైదరాబాద్‌లోని మలక్‌పేట, అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, గోల్కొండ, కార్వాన్, మెహిదీపట్నం బహదూర్‌పురా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని పదుల ప్రాంతాల్లో 7 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పంటపొలాల్లోకి వరదనీరు చేరింది. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలంలోని అశోక్‌నగర్, ఇందిరానగర్ కాలనీల్లోకి వర్షపునీరు చేరింది. మొర్రేడువాగు, గోధుమవాగు, కిన్నెరసాని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. తూప్రాన్, న్యాల్కల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది.
తూర్పుమధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆదివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న తెలిపారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి బుధవారం వరకు చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీనుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాల్లోని ఒకటి రెండుచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురువొచ్చని తెలిపారు. సోమవారం, మంగళ, బుధవారాల్లోనూ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
రాష్ట్రంలో ఆగస్టులో మంచి వర్షాలు కురిశాయి. 28 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వానలు పడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే భూగర్భజలాలు సైతం పైకి వచ్చినట్టు భూగర్భజలశాఖ నివేదిక తెలిపింది. ఆగస్టు నెలలో రాష్ట్ర సగటు వర్షపాతం కంటే 141 మిల్లీమీటర్ల వాన అధికంగా కురిసింది. గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లిలో సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షం పడింది. మిగతా అన్ని జిల్లాల్లో అధిక వానలే నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో సాధారణం కంటే 83 శాతం అధికంగా వర్షం కురవగా.. 68 శాతంతో నారాయణపేట జిల్లా ఆ తర్వాత స్థానంలో ఉన్నది. పెద్దపల్లి జిల్లాలో సాధారణం కంటే 12 శాతం తక్కువ వర్షం కురిసింది. రాష్ట్రంలో భూఉపరితలానికి సమీపంలో భూగర్భజలాలు ఉన్న జిల్లాగా జగిత్యాల, అతి ఎక్కువ లోతులో భూగర్భజలాలు ఉన్న జిల్లాగా మెదక్ నిలిచాయి. మెదక్‌లో 12.52 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. గత ఆగస్టుతో పోలిస్తే సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 6.38 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయి. అతి తక్కువగా కేవలం 0.13 మీటర్ల భూగర్భజలాలు పెరిగిన జిల్లాగా ములుగు నిలిచింది.
రాష్ట్రంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. ఎల్లంపల్లికి 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకాగా, ఎస్సారెస్పీకి 46 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. కృష్ణా పరివాహక ప్రాజెక్టులకూ స్వల్పంగా ఇన్‌ఫ్లోలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరింది. దీంతో ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.