Residential Schools | హైదరాబాద్, అక్టోబర్26 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో ఇటీవల భర్తీ చేసిన పోస్టుల్లో ఇప్పటికే భారీగా బ్యాక్లాగ్ ఏర్పడగా, తాజాగా డీఎస్సీ ఫలితాలతో మరిన్ని పోస్టులు ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం గురుకులాల పనివేళలు, పేరుకే ప్రభుత్వ ఉద్యోగి తప్ప ఇతర సర్వీస్ సబార్డినేట్ రూల్స్ ఏవీ వర్తించకపోవడమేనని సొసైటీ ఉద్యోగులు తెలుపుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి ట్రిబ్ గతేడాది ఆగస్టులోనే రాత పరీక్షను నిర్వహించింది. కోర్టు కేసుల నేపథ్యంలో మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులను మినహాయించి మిగతా పోస్టుల భర్తీని చేపట్టింది. 8,708 పోస్టులకు 1:2 ఎంపిక చేసింది. కొన్ని కేటగిరీల్లో అర్హులు లేరని 404పోస్టులను భర్తీ చేయలేదు. మొత్తంగా 8,304 పోస్టులకు తుది జాబితాలను ప్రకటించి ఆర్డర్లు ఇచ్చింది. వారిలో దాదాపు 2వేల మంది అభ్యర్థులు ఇప్పటికీ జాయిన్ కాలేదని తెలుస్తున్నది. ఆయా అభ్యర్థులు జాయిన్ కావడానికి మరో నెలరోజుల పాటు గడువు ఉన్నా, ఇప్పటికే వరకు మొత్తంగా 2500 పోస్టులు ఖాళీగా మిగిలిపోవడం గమనార్హం.
డీఎస్సీతో మరో వెయ్యి..!
గురుకుల పోస్టులకు రాత పరీక్ష రాసిన చాలా మంది అభ్యర్థులు డీఎస్సీ రాతపరీక్షకు కూడా హాజరయ్యారు. డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు ఇటీవల ఆయా సొసైటీల నుంచి ఎన్వోసీ (నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్) కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఎన్వోసీలకు దరఖాస్తు పెట్టుకున్న అభ్యర్థులు అన్ని సొసైటీల్లో కలిపి 1000 మందికిపైగా అభ్యర్థులు ఉన్నారు. ఆ మేరకు పోస్టులు గురుకులాల్లో మళ్లీ ఖాళీ అయ్యే దుస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే గతంలోనే టీజీపీఎస్సీ నిర్వహించిన 1,302 జేఎల్ పోస్టుల రాత పరీక్షలకు సంబంధించి ఇటీవలనే 1:2 జాబితాలను ప్రకటించగా, గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులే చాలా మంది అభ్యర్థులు జేఎల్ పోస్టులనూ సాధించారు. దీంతో గురుకులాల్లో నియామకమైన పోస్టుల్లో ఎక్కువ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశమే ఉన్నది. గురుకులాల్లో పోస్టింగ్ సాధించిన అభ్యర్థులు ఆ తరువాత అనేక మంది వదులుకుంటున్నా రు. అందుకు ప్రధాన కారణం గురుకులాల్లో ని పనివేళలు, ఇతర సర్వీస్ రూల్సే కారణమ ని పలువురు అధ్యాపకులు వెల్లడిస్తున్నారు.