BRS | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మహారాష్ట్ర విభాగంలో నూతనోత్సాహం ఉరకలెత్తుతున్నది. అనతికాలంలోనే గులాబీ జెండా ఊరూరా రెపరెపలాడుతున్నది. ఇల్లిల్లూ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని నినదిస్తున్నది. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ అమలు డిమాండ్ రోజురోజుకు అధికమవుతున్నది. రైతులు, రైతు కూలీలు, మహిళలు ప్రత్యేకించి యువకులు గ్రామగ్రామాన బీఆర్ఎస్లో చేరుతున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ప్రారంభమైన సభ్యత్వ నమోదు, గ్రామ పార్టీ, తొమ్మిది అనుబంధ కమిటీల నిర్మాణం పోటాపోటీగా సాగుతున్నది. పార్టీ సభ్యత్వ నమోదు కోసం వెళ్లే బీఆర్ఎస్ బృందాలకు మహారాష్ట్ర వాసులు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. బీఆర్ఎస్ సిద్ధాంతం, ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం, భవిష్యత్ చిత్రణకు సంబంధించి పార్టీ ప్రచార వాహనంలో (నియోజకవర్గానికో వాహనం)ని మైక్‌లో స్థానిక మరాఠీ భాషలో పాటలను వినిపిస్తున్నది. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ ఎందుకు అవసరమో వివరిస్తూ పార్టీ ముందుకు సాగుతున్నది. ఆలయాల ముందు, ప్రజలు తమ ఆరాధ్యులుగా భావించే డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబాపూలే, ఛత్రపతి శివాజీ ఇలా వైతాళికుల విగ్రహాల దగ్గర బీఆర్ఎస్ నాయకులు నిలబడి పార్టీ సిద్ధాంతాన్ని వివరిస్తున్నారు.
ప్రజలు బీఆర్ఎస్లో చేరటాన్ని పవిత్ర కార్యంగా భావిస్తున్నారని ఆ పార్టీ నేత, షేత్కారీ నేత సుధీర్ సుధాకర్‌రావు బిందు చెప్పారు. సోన్‌పేట్ తాలూకాలో శ్రీక్షేత్ర దత్తవాడిలోని శ్రీముక్తేశ్వర్నారాయణ్ దత్తానంద సంస్థాన్ దగ్గర తాము పార్టీ ప్రచారం, సిద్ధాంతాన్ని వివరించిన తరువాత బీఆర్ఎస్ పార్టీ సైతం పవిత్రమైనదేనని, అందులో తామం తా చేరతామని మహిళలు, యువతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఈ ప్రచార పర్వం లో తమకు ఎదురైన గొప్ప అనుభూతి అని చెప్పారు. గ్రామీణం, పట్టణం అనే తేడాలేకుం డా అన్ని ప్రాంతాల నుంచి బీఆర్ఎస్కు విశేష స్పందన వస్తున్నదని చెప్పారు. తెలంగాణ రైతులు, సామాన్య పౌరుల కోసం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను మహారాష్ట్రలో అమలు చేయాలన్నదే మహారాష్ట్రీయుల డిమాండ్ అని చెప్పారు. అం దుకోసమే తాము చిత్తశుద్ధితో పార్టీ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. తమతోపాటు సీనియర్ నా యకులు మాణిక్‌రావ్ కాంబ్లే గురూజీ, గణేష్ పాటిల్, సోమనాథ్ నాగురే, మౌలి జోగ్దండ్, అన్నాసాహెబ్ జోగ్దండ్, విశ్వంభర్ గోర్వే, ప్రతాప్ భండారే, రమాకాంత్ ములే, భాగవత్ బచాటే, హౌసాబాయి తదితరులున్నారని సుధీర్ సుధాకర్‌రావు బిందు పేర్కొన్నారు.