హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల వరద కొనసాగుతున్నది. పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, ప్రజాసంఘాల నేతలు, మేధావులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. శనివారం మహారాష్ట్రకు చెందిన కీలక నేత మచ్చీంద్ర గుణ్వంతరావ్ చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది. లాథూర్ జిల్లా ఉద్గిర్ నియోజకవర్గానికి చెందిన గుణ్వంతరావ్కు స్థానికంగా ప్రజల్లో మంచి పట్టున్న ప్రముఖ రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉన్నది. 2009లో ఉద్గిర్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి లాథూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి దాదాపు 4 లక్షల ఓట్లు సాధించారు. విద్యార్థి నాయకునిగా, కమ్యునిస్టుపార్టీ అనుబంధ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేసిన గుణ్వంతరావ్ సామాజిక, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించారు. పలు కీలక పదవుల ద్వారా ప్రజాసేవ చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ, అంచెలంచలుగా ఎదుగుతూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ లౌకిక, ప్రజాస్వామిక రాజకీయ పంథాకు ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనతోపాటు ఎన్సీపీకి చెందిన రాయగఢ్ జిల్లా నివాసి రాహుల్ ఎస్ సాల్వీ, మహద్ తాలూకకు చెందిన సిద్దార్థ్ హటే, రాయగఢ్, థానే, కొంకణ్ ప్రాంతానికి చెందిన ప్రకాశ్ కే తొంబారే, రాయగఢ్‌కు చెందిన సామాజిక కార్యకర్త మునాఫ్ అమీర్ అధికారి, సౌత్ ముంబయ్‌కి చెందిన దేవేంద్ర సోలంకి, నార్త్ ముంబయ్‌కి చెందిన మాజీ కార్పోరేటర్ పీఎస్ నాగరాజన్ తదితరులు పార్టీలో చేరారు. వీరికి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల సుమన్, మహారాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నేతలు మాణిక్ కదమ్, శంకరన్న దోండ్గే తదితరులు పాల్గొన్నారు.

Kcr1