Bhu Bharati | యాదగిరిగుట్ట, జనవరి 12: భూభారతి చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని భూ రిజిస్ట్రేషన్ చలాన్ల ఎడిటింగ్ కుంభకోణంలో అక్రమార్కుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 120 మంది డాక్యుమెంట్ రైటర్లకు ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుండగా వీరి సంఖ్యమరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. వీరిందరిని జిల్లా రెవెన్యూ అధికారులు పిలిపించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని వసూలు చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇందులో ప్రధాన సూత్రధారుడైన యాదగిరిగుట్ట పట్టణంలోని అశోక భూభారతి రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని నడిపిస్తున్న పన్నీరు బస్వరాజుతోపాటు రాజాపేట మండలం చల్లూరుకు చెందిన గణేశ్, బేగంపేటకు చెందిన పాండును గత గురువారం అర్ధరాత్రి వరంగల్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఆదివారం అర్ధరాత్రి యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న లక్ష్మీదేవి డాక్యుమెంటేషన్, ఆన్లైన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకుడు భానుప్రసాద్, మోటకొండూర్కు చెందిన మనుశ్రీ సీఎస్సీ సెంటర్ నిర్వాహకుడు నాగరాజుతోపాటు జిల్లాలోని పలు ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 1300 నకిలీ డాక్యుమెంట్లను సీసీఎల్ఏ అధికారులు గుర్తించారు. గుండాల మండలంలో 31 డాక్యుమెంట్లలో అవకతవకలు జరిగినట్టు గుర్తించగా.. అధికారికంగా 8 డాక్యుమెంట్లు మాత్రమే గుర్తించినట్టు తహసీల్దార్ తెలిపారు.