కంది, జనవరి 7: గుండెపోటు కన్నా కాలుష్యం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయని.. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం దేశానికే ప్రమాదకరమని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో ఊపిరితిత్తుల ఆరోగ్యంపై దృష్టిసారించడం అత్యవసరమని, ఈ రంగంలో విస్తృత పరిశోధనలు చేయాల్సి ఉన్నదని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో దేశంలోనే తొలి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సంబంధించిన బయో ఇంజినీరింగ్ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఐఐటీ హైదరాబాద్-జర్మనీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్(ఐఎల్హెచ్)లు సంయుక్తంగా ఈ పరిశోధనలు నిర్వహించనుండగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ము ఖ్య అతిథులుగా ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డీ నాగేశ్వర్రెడ్డి, ఐఎల్హెచ్(జర్మనీ) డైరెక్టర్ ప్రొఫెసర్ వెర్నర్ సీగర్, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పాల్గొన్నారు.
ఐఎల్హెచ్తో కలిసి ఐఐటీహెచ్లో క్లినికల్ పరిశోధనలు చేయడం రోగులకు ప్రయోజకరమని నాగేశ్వర్రెడ్డి తెలిపారు. మరో 3-4 ఏండ్లలో ఫలితాలు అందుతాయని పేర్కొన్నారు. ఆరోగ్య పరిశోధనలు కొత్త యుగానికి నాంది పలుకుతాయని, పరిశోధనల్లో వేగం పెంచి, భవిష్యత్ హెల్త్ ఇంజినీర్లను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఐఎల్హెచ్ డైరెక్టర్ వెర్నర్ సీగర్ పేర్కొన్నారు. అనంతరం కార్డియాలజీ, పల్మనాలజీ, పీడియాట్రిక్,కార్డియోవాస్క్యులర్, థొరాసిక్ సర్జరీ రంగాల నిపుణులతో రౌండ్ టేబుల్ చర్చలు జరిగాయి.