Farmers | హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ): సాగునీళ్లు వస్తాయని గంపెడాశలతో యాసంగి సాగు చేసిన రైతుల బతుకు ఆగమైంది. ప్రాజెక్టుల నీళ్లు వదలక పంటలన్నీ ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ వట్టిపోయాయి. కరువు కోరల్లో చిక్కుకుని అన్నదాతలు విలవిలలాడుతున్నారు. ఎండిన పంటలు పోను పొట్ట దశకు వచ్చిన వరిపంటనైనా ఇంటిని తీసుకెళ్తామనుకున్న రైతుపై ప్రకృతి పగ పట్టింది. అకాల వర్షాలతో నోటి కాడి బుక్కను కూడా నేలరాల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో సుమారు 66 లక్షల ఎకరాల్లో పంటలు సాగైంది. ఇందులో 51 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంది. ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో యాసంగి పంటలకు నీళ్లు కరువయ్యాయి. సాగు నీటి కొరతతో ఇప్పటికే సుమారు 15 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు అంచనాలు ఉన్నాయి. ఇది మరో 10 లక్షలు పెరిగే అవకాశం ఉంది. ఎండిన పంటలకు కొందరు రైతులు నిప్పు పెడుతుంటే మరికొందరు రైతులు పశువులను మేపుతున్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఆదివారం కురిసిన వడగండ్ల వర్షాలతో పలు జిల్లాల్లో భారీ విస్తీర్ణంలో వరి పంట, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
సర్కారు మొద్దు నిద్ర
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతుకు ప్రభుత్వ భరోసా కరువైంది. పంట నష్టపరిహారం ఇచ్చైనా ఆదుకోవాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇప్పటి వరకు పంట నష్టాన్ని అంచనా వేసిందీ లేదు. కనీసం నిండా మునిగి కన్నీరు కారుస్తున్న రైతును పలుకరించిన నాథుడే లేదు. ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటి వరకు పంట నష్టంపై సర్వే చేయలేదు. సమీక్ష కూడా చేయలేదు. ఇప్పటికైనా పంట నష్టం అంచనాకు సర్వే చేయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.