హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (డీటీసీ) మూడ్ కిషన్ నాయక్‌కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ అధికారులు రెండో రోజూ ఆయన బినామీలు, కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంకు లాకర్లపై ఆరా తీశారు. ఆయన వద్ద పనిచేసే డ్రైవర్ శివశంకర్‌ను బినామీగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కిషన్‌కు చెందిన నగదు, ఇతర విలువైన స్థలాలు డ్రైవర్ పేరుపై ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కాగా, కిషన్‌నాయక్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడనే సమాచారంతో ఏసీబీ మంగళవారం ఏకకాలంలో 12 చోట్ల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో రూ.12.72 కోట్ల అక్రమాస్తులను గుర్తించగా, బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.350 కోట్లకుపైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కిషన్‌నాయక్ అరెస్టు విషయాన్ని తెలుసుకుని పరారైన డ్రైవర్ శివశంకర్ కోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ కేసులో శివశంకర్ పట్టుబడితే మరింత కీలక సమాచారం దొరికే అవకాశం ఉన్నది.