High Court | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పర్యవేక్షణ బాధ్యత తమదేనని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో చెరువులకు హద్దుల నిర్ధారణపై బుధవారం జరిగిన విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులన్నింటి ఎఫ్టీఎల్ను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయాలని ఆదేశించింది. డిసెంబర్ 30లోగా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల గుర్తింపుపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని రామమ్మకుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నిర్మాణాలు ప్రారంభించడంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ నిర్ధారణపై గడిచిన కొంతకాలంగా హెచ్ఎండీఏ పనులు చేపడుతూనే ఉంది. నత్తనడకన సాగుతున్న హద్దుల నిర్ధారణతో ఇప్పటికే మూ డు నెలలు గడిచింది. కానీ ఇప్పటివరకు నోటిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో హద్దుల నిర్ధారణపై జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ వారం క్రితం కోర్టు సీరియస్ వ్యాఖ్య లు చేసింది. తాజాగా విచారించిన హైకోర్టు.. ఇకపై తామే పూర్తి పర్యవేక్షణ బాధ్యత తీసుకున్నామని, ఈ విషయంలో హద్దుల నిర్ధారణకు నెల రోజుల గడువునిస్తున్నట్టు పేర్కొంది. హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల వ్యవహారంపై తాము పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్టు ప్రకటించింది.
ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించినట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్‌ఖాన్ గత జూలైలో ఇచ్చిన హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించింది. గత జులై 24న వ్యక్తిగతంగా కమిషనర్ సర్ఫరాజ్‌ఖాన్ హాజరైనప్పుడు హెచ్ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని, 230 చెరువులకు ఎఫ్టీఎల్ కోసం తుది నోటిఫికేషన్ ఇచ్చినట్టు చెప్పారు. మరో 2,525 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ వెలువరించినట్టు తెలిపారు. దీనిపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది నోటిఫికేషన్ ఇస్తామని అప్పట్లో కమిషనర్ ఇచ్చిన హామీ ఎందుకు అమలు కాలేదని హైకోర్టు ప్రశ్నించింది. మూడు నెలల గడువు పూర్తయ్యింది, ఇంకెంత సమయం కావాలని నిలదీసింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పుడు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడిందని, వాటిలో 530 చెరువులకు తుది నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు, గత విచారణ సమయంలో హెచ్ఎండీఏ కమిషనర్ 2,525 చెరవులని చెప్పారని, ఇప్పుడు ఆ సంఖ్య ఎలా పెరిగిందని ప్రశ్నించింది. తదుపరి విచారణ జరిగే డిసెంబర్ 30 నాటికి ఎఫ్టీఎల్, బఫర్జోన్ల గుర్తింపుపై స్థాయీ నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేసింది.
డిసెంబర్ నెలాఖరులోగా సాధ్యమయ్యేనా?
ఆగస్టు నెలాఖరు నుంచి నవంబర్ వరకు హద్దుల నిర్ధారణపై నివేదిక ఇవ్వాల్సిన హెచ్ఎండీఏ మరోసారి గడువు కోరింది. కానీ డిసెంబర్ నెలాఖరులోగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులకు హద్దులను పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేయడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలో నెల రోజుల వ్యవధిలో పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ జారీ చేయలేమని చర్చించుకుంటున్నారు.