హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : రానున్న 24గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 8న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ అకస్మిక మార్పుల వల్ల ముందుకు సాగలేదని పేర్కొన్నది. తమిళనాడు, రాయలసీమ మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి ఏర్పడటంతో మళ్లీ పుంజుకున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. సోమవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురువగా, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కున్నారంలో అత్యధికంగా 17.29 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. మంగళవారం జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. బుధవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.