Monsoon | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం భారతదేశంలో షెడ్యూల్ కంటే ముందే వచ్చింది. నైరుతి రుతుపవనాల ముందస్తు రాక అరుదుగా జరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పెద్దఎత్తున సంభవించే వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని అంటున్నారు. మే 21కి బదులుగా మే 13న దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలకు రుతుపవనాలు వచ్చాయి. నైరుతి రుతుపవనాలు శనివారం భారతదేశంలోని కేరళకు చేరా యి. జూన్ 1 కంటే ఎనిమిది రోజుల ముందుగానే ప్రవేశించాయి. ఇంతకుముందు 2001, 2009లో రుతుపవనాలు త్వరగా వచ్చాయని నిపుణులు చెప్తున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
1. మాడెన్-జూలియన్ ఆసిలేషన్(ఎంజేవో): ఎంజేవో.. ఇది సంక్లిష్టమైన సముద్ర వాతావరణ దృగ్విషయం. ఇది భారత రుతుపవనాలకు ప్రధానంగా దోహదపడుతుంది. మేఘాలు, గాలి, పీడనం సెకనుకు 4-8 మీటర్ల వేగంతో తూర్పు వైపునకు కదులుతున్నప్పుడు ఎంజేవో విండ్ బ్యాండ్లు ఏర్పడుతాయి. 30-60 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. ఈ చర్య భారత్ అంతటా జరిగితే, ఇది రుతుపవనాల సమయంలో వర్షపాతాన్ని ఉత్ప్రేరకపరుస్తుంది.
2. మసరీనా హై: దక్షిణ హిందూ మహాసముద్రంలోని మసరీన్ దీవులకు సమీపంలో ఉన్న అధిక పీడన ప్రాంతం. భారతదేశ రుతుపవన వర్షపాతంలో గణనీయమైన పాత్ర పోషిస్తుందని ఐఎండీ వివరిస్తుంది. ఈ పీడనం తీవ్రతలో మార్పులు దేశ పశ్చిమ తీరం వెం బడి వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి.
3. వేడి, తేమ, సోమాలిజెట్ నిలువు రవాణా: వేడి, తేమ నిలువుగా ప్రయాణించినప్పుడు, ఈ చర్యను ఉష్ణప్రసరణ అంటారు. ఉష్ణప్రసరణ చర్యలో పెరుగుదల దేశంలో వర్షపాతానికి దోహదం చేస్తుంది. మారిషస్, ఉత్తర మడగాసర్ సమీపంలో ఉద్భవించిన తకువస్థాయి, అంతర్ అర్ధగోళ క్రాస్ ఈక్వటోరియల్ విండ్ బ్యాండ్‌ను సోమాలిజెట్ అంటారు. ఇది మేలో ఆఫ్రికన్ తీరాన్ని దాటిన తర్వాత అరేబియా సముద్రం, భారత పశ్చిమ తీరానికి చేరుకుంటుంది. సోమాలిజెట్ ఎంత బలంగా ఉంటే, భారతదేశంలో రుతుపవన గాలులు అంతబలంగా ఉంటాయి.
4. సూర్యుడు ఉత్తరార్ధాగోళం వైపు కదిలిన తర్వాత అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. పాకిస్థాన్, సమీప ప్రాంతాలపై ఉన్న అల్పపీడన మండలం ఉత్ప్రేరకంగా పనిచేసి, రుతుపవన ద్రోణి వెంబడి తేమతో కూడిన గాలిని ఆకర్షించి, వర్షపాతాన్ని పెంచుతుంది.
5. రుతుపవన ద్రోణి అనేది అతిశీతల స్థాయి నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న పొడవైన అల్పపీడన ప్రాంతం. ఈ ద్రోణి ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు మారినప్పుడు, జూన్ -సెప్టెంబర్ కాలంలో కోర్ రుతుపవన మండలంలో వర్షపాతం ఏర్పడుతుంది.