మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 01:43:39

10న రాష్ర్టానికి నైరుతి

10న రాష్ర్టానికి నైరుతి

  • చురుకుగా కదులుతున్న రుతుపవనాలు
  • ద్రోణి ప్రభావంతో రెండ్రోజులు వర్షాలు
  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇదే వేగంతో విస్తరిస్తే రుతుపవనాలు ఈ నెల 10న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెడ్‌ డాక్టర్‌ నాగరత్న తెలిపారు. దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక, రాయలసీమలోని కొన్నిప్రాంతాల్లో, తమిళనాడులోని చాలా ప్రాంతాలు, బంగాళాఖాతంలోని పలు దిశల్లోనూ నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు ఆమె ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. మంగళవారం సాయంత్రం నుంచి నైరుతి రుతుపవనాలు తెలంగాణకు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. 

తెలంగాణలోకి వచ్చిన 24 గంటల తర్వాత వాటి విస్తరణను పరిశీలించాకే నైరుతి ప్రవేశించినట్టు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతం తూర్పుదిశ నుంచి తెలంగాణవైపు తేమతోకూడిన గాలులు వీస్తున్నాయని తెలిపారు. దీని కారణంగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. మరోవైపు, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనుండటంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో వాతావరణం చల్లగా మారుతున్నది. మూడ్రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణస్థితికి చేరుకున్నాయి. ఆదివారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.2 డిగ్రీలు, గాలిలో తేమ 39 శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు.


logo