హైదరాబాద్, జూన్ 3(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతపవనాలు 24గంటల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 6న రాయలసీమ, 8వ తేదీ నాటికి తెలంగాణకు చేరుకొనే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో ఇప్పటికే విస్తారంగా చిరుజల్లులు కురుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. మంగళవారం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమైన ఉపరితల చక్రవాక ఆవర్తనం బుధవారం బలహీనపడిందని, ఈ ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అకడకడ కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. గురు, శుక్రవారా ల్లో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.
రాష్ట్రంలో రానున్న నాలు గు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నదని తెలిపారు. బుధవారం సూర్యాపేట లో అత్యధికంగా 44.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 40 నుంచి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం సాయంత్రం నల్లగొండ, సూర్యాపేట, యా దాద్రి-భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, హనుమకొండ, కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 24గంటల్లో అత్యధికంగా ఎన్కూరు (ఖమ్మం)-5.74 సెం.మీ వర్షం పడింది.