హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ) : వ్యవసాయ శాఖ బుధవారం వెల్లడించిన వానకాలం పంటల సాగు లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకవైపు వర్షాలు కురవక, సాగు ముందుకు కదలక రైతులు ఆందోళన చెందుతుంటే, ఇంకోవైపు వ్యవసాయ శాఖ మాత్రం రాష్ట్రంలో నిరుటితో సమానంగా పంటలు సాగవుతున్నట్టు వెల్లడించింది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 61.1 లక్షల ఎకరాల్లో పంటల సాగు పూర్తయినట్టు వ్యవసాయ శాఖ వారాంతపు నివేదికలో పేర్కొన్నది. నిరుడు రాష్ట్రవ్యాప్తంగా 61.63 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అయినట్టు, గత సంవత్సరంతో పోల్చితే 53 వేల ఎకరాలు మాత్రమే తగ్గినట్టు పేర్కొన్నది. ఇందులో అత్యధికంగా పత్తి 38.56 లక్షల ఎకరాల్లో, వరి 7.78 లక్షలు, మక్కజొన్న 4.49 లక్షలు, కందులు 3.43 లక్షల ఎకరాల్లో సాగైనట్టు వెల్లడించింది. ప్రధాన పంటల సాగు గతంతో పోల్చితే పెరిగినట్టు వ్యవసాయ శాఖ నివేదిక పేర్కొన్నది. నిరుడు ఈ సమయానికి పత్తి 37.62 లక్షల ఎకరాల్లో సాగు కాగా ప్రస్తుతం 38.56 లక్షల ఎకరాల్లో సాగైనట్టు తెలిపింది. ఇది గత సంవత్సరం కంటే 94 వేల ఎకరాలు అధికం. వరి గత సంవత్సరం 4.93 లక్షల ఎకరాల్లో సాగైతే, ప్రస్తుతం 7.78 లక్షల ఎకరాల్లో సాగైంది. గత సంవత్సరంతో పోల్చితే వరి సాగు విస్తీర్ణం 2.85 లక్షల ఎకరాలు పెరిగింది. మక్కజొన్న గత సంవత్సరం 2.89 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం 4.49 లక్షల ఎకరాల్లో సాగైంది. గత సంవత్సరంతో పోల్చితే 1.6 లక్షల ఎకరాలు పెరిగింది. కంది పంట సైతం నిరుటితో పోల్చితే 29 వేల ఎకరాలు పెరగడం గమనార్హం. ఈ ఏడాది వర్షాలు లేకపోయినా పంటల సాగు అధికంగా ఉండటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయ శాఖ విడుదల చేసిన వారంతాపు సాగు నివేదికలో ప్రస్తుతం లోటు వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది. గత సంవత్సరంతో పోల్చితే 35% లోటు వర్షపాతం ఉన్నదని, ఈ సంవత్సరంలో పడాల్సిన వర్షాల కన్నా 28% తక్కువ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. దాదాపు 33 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే ఉన్నట్టు స్పష్టంగా పేర్కొన్నది. లోటు వర్షపాతం నమోదైనట్టు చెప్తున్న వ్యవసాయ శాఖ.. అదే సమయంలో పంటల సాగు ఎక్కువగా చూపించడం విమర్శలకు తావిస్తున్నది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేనప్పుడు పంటల సాగు అధికంగా ఎలా అవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వ్యవసాయ శాఖ విడుదల చేస్తున్న సాగు లెక్కలు కాకి లెక్కలేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సీజన్ ప్రారంభమై సుమారు నెలన్నర అవుతున్నది. ఇప్పటివరకు పంటల సాగును లెక్కించేందుకు ఏఈవోలు నిర్వహించే క్రాప్ బుకింగ్ ప్రక్రియ మొదలు కాలేదు.
‘పంటలు ఎండిపోతున్నాయి.. వరుణ దేవా కరుణించి కాపాడు’ అంటూ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామస్థులు వేడుకుంటున్నారు. వర్షాలు కురవాలని కోరుతూ గురువారం కప్పతల్లి ఆటలు ఆడారు. రైతులంతా కప్పతల్లి, ఊరు పోచమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు అభిషేకాలు చేశారు.