ఎనిమిదేండ్లు.. 8 రాష్ర్టాలు.. 171 మంది ఎమ్మెల్యేలు.. రూ.12,515 కోట్ల ఖర్చు.. విపక్ష ప్రభుత్వాలను కూల్చటానికిబీజేపీ సాగించిన బేరాల పరిమాణం ఇది. ఒక్క మహారాష్ట్రలోనే శివసేనలో చీలిక తెచ్చేందుకు ఏకంగా రూ.4,600 కోట్లు వెచ్చించినట్టు తెలిసింది. అక్కడ ఒక్కో ఎమ్మెల్యేకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ముట్టజెప్పినట్టు సమాచారం. తెలంగాణలో ఆ పార్టీ కొనుగోళ్ల వ్యవహారం బయటపడిన నేపథ్యంలో ఈ చిట్టా బట్టబయలైంది. కేవలం నాలుగు రాష్ర్టాల్లో అధికారం చేజిక్కించుకొనేందుకు ఏకంగా రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది.
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో పెద్ద ‘మనీ మాఫియా’ తిరుగుతున్నది. రూ.వేల కోట్ల డబ్బును ప్రత్యేక విమానాల్లో తిప్పుతూ.. రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చుతున్నది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాలే దాని టార్గెట్. ఇప్పటికే 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను ఈ ముఠా అన్యాయంగా కూల్చేసి, అక్రమంగా గద్దెనెక్కింది. ఇప్పుడు వాళ్ల కన్ను పచ్చటి తెలంగాణ సహా నాలుగు రాష్ర్టాలపై పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ముఠా పన్నాగాలను ముందుగానే గుర్తించి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని ఆధారాలతో సహా ప్రపంచం ముందు ఉంచారు. దీంతో దేశం మొత్తం నివ్వెర పోతున్నది. ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు రూ.50-100 కోట్లు ఇచ్చేందుకు సైతం ఈ ముఠా వెనుకాడటం లేదు. ‘తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు ఎంతైనా ఇచ్చి కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ దళారులు చెప్పిన సంగతి తెలిసిందే. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చిన ముఠా.. ఒక ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇస్తామని హామీ ఇవ్వగా, మిగతా ముగ్గురికి రూ. 50 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పారు. మొత్తం 34 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఈ ముఠా ప్లాన్ చేసింది. అంటే.. ఒక్క తెలంగాణపైనే సుమారు రూ.1,800 కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధమైంది. ఈ లెక్కన నాలుగు రాష్ర్టాల్లో కలిపి ప్రభుత్వాలను ఏర్పాటు చేయదగిన బలాన్ని కొనేందుకు ఏకంగా రూ.10 వేల కోట్లకుపైనే ఖర్చవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
రాజస్థాన్ బడ్జెట్.. రూ.1,600 కోట్లు
మొత్తం ఎమ్మెల్యే సీట్లు: 200
మ్యాజిక్ ఫిగర్: 101, బీజేపీ: 71
కొనుగోలు చేయాల్సింది: 30 మంది
రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని బీజేపీ మొదటి రోజు నుంచీ జీర్ణించుకోలేకపోతున్నది. యూపీఏకు 123 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉన్నది. అయినా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ గోతికాడి నక్కలా ఎదురుచూస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్‌ను అడ్డం పెట్టుకొని పార్టీలో, ప్రభుత్వంలో చీలిక తేవాలని విఫలయత్నం చేసినా సాధ్యం కాలేదు. అక్కడ బీజేపీకి 71 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకో 30 మంది చేరితే చాలు అధికారంలోకి రావొచ్చన్నది ఆ పార్టీ ఉద్దేశం. ఇది సాధ్యం కావాలంటే.. కనీసం రూ.1,600 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.
ఏపీ దక్కాలంటే రూ.4,500 కోట్లు
మొత్తం ఎమ్మెల్యే సీట్లు: 175
మ్యాజిక్ ఫిగర్: 88, బీజేపీ: 0
కొనుగోలు చేయాల్సింది: 88 మంది
ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నది. ఆ పార్టీకి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడా ప్రభుత్వాన్ని కూలదోస్తామని దళారులు స్పష్టంగా చెప్తున్నారు. వాస్తవానికి ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారట. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 88. అంటే ఏపీలో 88 మందిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సగటున లెక్క వేసుకున్నా.. కనీసం రూ.4,500 కోట్లు ఖర్చు చేసేందుకు బీజేపీ సిద్ధమైనట్టు స్పష్టమవుతున్నది.
రూ.2,500 కోట్లతో ఢిల్లీపైకి..
మొత్తం ఎమ్మెల్యే సీట్లు: 70
మ్యాజిక్ ఫిగర్: 36, బీజేపీ: 8
టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు : 43
బీజేపీకి మింగుడుపడని సీఎంలలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒకరు. బీజేపీ మోసాలను ప్రజలు గుర్తించి అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినట్టు ఫలితం ఇచ్చారు. మొత్తం 70 స్థానాలకుగానూ 62 ఆప్‌కు కట్టబెట్టారు. బీజేపీకి 8 మంది సభ్యులే ఉన్నారు. అయినా.. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ మొదటి నుంచీ విశ్వప్రయత్నం చేస్తున్నది. సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగిస్తున్నది. సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోలో ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని ముఠా సభ్యులు చెప్పారు. అంటే వాళ్లను కొనుగోలు చేయడానికి రూ.రూ.2,300 కోట్లు సిద్ధంగా ఉంచుకున్నారన్నమాట.