హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీది మతతత్వ ఎజెండా అయితే, టీఆర్ఎస్ సర్కారుది అభివృద్ధి ఎజెండా అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మోదీ అసమర్థ పాలన వల్లే దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నదని ఆరోపించారు. దేశాన్ని కాపాడేందుకే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకొన్నారని తెలిపారు.
దేశమంతా కేసీఆర్ను స్వాగతించటం చూసి ఓర్వలేకనే ప్రధాని మోదీ తెలంగాణపై విషం చిమ్మారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రమన్నా, కేసీఆర్ కుటుంబమన్నా బీజేపీకి భయమని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్నదని కేసీఆర్ కుటుంబమేనని తెలిపారు. కేసీఆర్ కుటుంబసభ్యులంతా ప్రజలచేత ఎన్నికై, వారి ఆశీర్వాదంతోనే రాజకీయాల్లో ఉన్నారని స్పష్టంచేశారు.
బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తే, టీఆర్ఎస్ అభివృద్ధిని చూపిస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నదని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకొన్నారని, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి దిశగా పయనిస్తున్నామని చెప్పారు. గుజరాత్కంటే అభివృద్ధిలో తెలంగాణ ముందున్నదన్న అక్కసుతోనే ప్రధాని మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్కు మాత్రమే ఓట్లడిగే హకు ఉన్నదని స్పష్టంచేశారు.