Wind Solar | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గతంలో ప్రతిపాదించిన నాలుగు జిల్లాలు విండ్ సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు అనువుకాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఆ నాలుగు జిల్లాల్లో ప్లాంట్లు పెట్టలేమని, ఆయా ప్రతిపాదనలను విరమించుకోవాలని కేంద్రాన్ని కోరనున్నది. గత ప్రతిపాదనలను మార్చాలని కేంద్ర విద్యుత్తు శాఖకు త్వరలోనే లేఖను రాయనున్నది.
వాటి స్థానంలో కొత్త జిల్లాలను రాష్ట్ర ఇంధశాఖ ప్రతిపాదించింది. తొలుత ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 19 వేల మెగావాట్ల విండ్ సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లను నిర్మించేందుకు కేంద్ర విద్యుత్తుశాఖ గతంలో గుర్తించింది.
ఆయా జిలాల్లో కొత్త పాంట్లను నిర్మించాలని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంధనశాఖ అధికారులు అధ్యయనం చేశారు. ఆయా జిల్లాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు పలురకాల ప్రతిబంధకాలు ఉన్నట్టు అధికారుల అధ్యయనంలో తేలింది. ప్లాంట్ల నిర్మాణం, గ్రిడ్ కనెక్టివిటీ వంటి సమస్యలు తలెత్తుతాయని, ప్లాంట్ల ఏర్పాటుకు ఆ ప్రాంతాలు అనువుకాదని తేలింది.
తొలుతు ఎంపిక చేసిన ఆ నాలుగు జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు భూముల లభ్యత తక్కువగా ఉన్నది. ప్లాంట్ల ఏర్పాటుకు వేలాది ఎకరాల భూమి కావాల్సి ఉండటం, అక్కడ సాగుభూములే అధికంగా ఉండటం, భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. భూసేకరణ సమస్యగా మారనున్నది. దీంతో ఆయా జిల్లాల్లో సోలార్ప్లాంట్లు నిర్మించడం కష్టమని అధికారులు తేల్చారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఇంధనశాఖ అధికారులు ఇతర జిల్లాలను ప్రతిపాదించారు. అధికంగా మైదాన ప్రాంతం, బీడు భూములు ఉండటం, ప్రభుత్వ భూముల్లోనూ ప్లాంట్ల ఏర్పాటుకు వీలుంటుందని భావించారు. కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో కొత్త పాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు.