హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ మారింది. మంగళవారం జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించటంతో అధికారులు మార్పులు చేశారు. జేఈఈ మొదటి సెషన్ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు సైతం ఏప్రిల్ 20 నుంచే ప్రారంభం కానుండటంతో షెడ్యూల్ మార్పు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20కి బదులు 22 నుంచి పరీక్షలు ప్రారంభించేలా కొత్త షెడ్యూల్‌ను రూపొందించిన ఇంటర్‌బోర్డు అధికారులు మంత్రి సబితాఇంద్రారెడ్డి అనుమతి కోసం పంపించారు. ఈ షెడ్యూల్‌కు మంత్రి ఆమోదం తెలిపారు. బుధవారం ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ కొత్త టైంటేబుల్‌ను విడుదల చేశారు.
ఇంటర్ ప్రాక్టికల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్‌ను ఏప్రిల్ 11, 12న జరుగుతాయి.
