Tamil Nadu CM : తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) సీ జోసెఫ్ విజయ్ (C Joseph Vijay) అవినీతిపై తన మంత్రులకు, ప్రభుత్వ యంత్రాంగానికి గట్టి హెచ్చరిక చేశారు. తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఎలాంటి రెండో అవకాశం ఉండదని గురువారం ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ అవినీతిపై జీరో టోలరెన్స్ (Zero Tolarence) విధానాన్ని మరోసారి ప్రకటించారు.
ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తన పార్టీ చెంగల్పట్టు ఈస్ట్ జిల్లా సంయుక్త కార్యదర్శి వీరసామిని విజయ్ పార్టీ నుంచి బహిష్కరించడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన వీడియో వైరల్ కావడంతో.. రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించారు. అనంతరం పోలీసులు కూడా ఆయనను అరెస్ట్ చేశారు. అయితే వీరసామి మాత్రం ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని ఆరోపిస్తున్నాడు.
ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీస్ విచారణ జరుగుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తున్న విజయ్.. అవినీతిపై రాజీపడబోమనే సంకేతాన్ని వరుస చర్యల ద్వారా ఇస్తున్నారు. ప్రజల సహకారంతోనే అవినీతిని పూర్తిగా నిర్మూలించగలమని ఆయన పదేపదే చెబుతున్నారు. ఈ క్రమంలో మొన్న కరూర్‌లో ఇటీవల నిర్వహించిన ప్రజాసభలో మాట్లాడుతూ.. తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి ఏమాత్రం తావుండబోదని తేల్చిచెప్పారు.
‘ఎవరైనా లంచం అడిగితే ‘ఇవ్వను’ అని చెప్పండి. మీ వెంటే నేను ఉంటాను. అయినా ఒత్తిడి చేస్తే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న విజయ్ మా వెన్నంటి ఉన్నారని ధైర్యంగా చెప్పండి’ అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టంచేశారు. ఇక అవినీతి నిర్మూలన కోసం విజయ్ ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.