హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ హోరెత్తింది. జాతీయ స్థాయి లో ట్విట్టర్ టాప్ ట్రెండ్స్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేస్తూ తెలంగాణకు సమానత్వం ఏది? అని వేలాది మంది నెటిజన్లు ప్రధాని మోదీని ప్రశ్నించారు. యువత నుంచి మం త్రుల వరకు అంతా సమానత్వం ఎక్కడని మోదీపై విరుచుకుపడ్డారు. రాష్ర్టానికి జాతీయ హోదా.. బడ్జెట్ లో నిధుల కేటాయింపు.. విభజన హామీలు ఏమయ్యాయని ప్రధానిని నిలదీశారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు, రామానుజాచార్య విగ్రహావిష్కరణకు మోదీ హైదరాబాద్‌కు వచ్చిన గంట వ్యవధిలోనే హ్యాష్‌ట్యాగ్ టాప్-1 ట్రెండింగ్‌లో నిలిచింది. అందులో భాగంగానే శనివారం కొందరు యువకులు ట్యాంక్‌బండ్ వద్ద భారీ ప్లెక్సీని ప్రదర్శించి కేంద్రం తీరును ఎండగట్టారు. కేంద్రం ఇచ్చిన మోసపూరిత హామీలు ఇవీ అంటూ పేర్కొన్న బ్యానర్‌తో నిరసన తెలిపారు. నిధులు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాలకు అందని సాయం, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలు, తెలంగాణకు దకని జాతీయ ప్రాజెక్టు హోదా తదితర అంశాల్లో ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యోగాల కల్పన, ఐటీఐఆర్, కోచ్ ఫ్యాక్టరీ, టర్మరిక్ బోర్డు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐఐఎం వంటి వాటిపై ముచ్చింతల్ పర్యటనకు ముందు మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర మంత్రుల ఆగ్రహం
వివిధ రంగాల్లో తెలంగాణపై కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను రాష్ట్ర మంత్రులు ఎండగట్టారు. ట్విట్టర్ వేదికగా.. ‘కేంద్రం కర్ణాటకలోని అప్పర్‌భద్ర ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చినప్పుడు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఎందుకు ఇవ్వదు?’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలపై తెలంగాణ ప్రభుత్వంతోపాటు మంత్రులు కేంద్రానికి పంపిన లేఖలపై ఇప్పటిదాకా స్పందించకపోవడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిలదీశారు. తెలంగాణలోని వ్యవసాయ, పారిశ్రామిక రంగంపై కేంద్ర వివక్షను మంత్రి నిరంజన్‌రెడ్డి ఎండగట్టారు. మేడారం సమ్మక-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడంపై మంత్రి సత్యవతి ప్రశ్నించారు. అద్భుతమైన వివిధ కార్యక్రమాలతో పురోగమిస్తున్న తెలంగాణ లాంటి అభివృద్ధికాముక రాష్ర్టాలను కేంద్రం ఎందుకు అడ్డుకొంటున్నదని ఎంపీ రంజిత్‌రెడ్డి ట్వీట్‌చేశారు. 22 వేలకు పైగా ట్వీట్లు ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో ట్రెండ్ కావడం విశేషం.