వ్యవసాయ చట్టాలపై సభలో ఎంత సేపు చర్చించారు?
ఏపీలో కలిపినఏడు మండలాలపై చర్చకు అవకాశం ఇచ్చారా?
రాష్ట్ర బిల్లు సభకు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారో జితేందర్‌రెడ్డిని అడగండి
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 10: బీజేపీ కేంద్రంలో ఒకటి చెప్తే.. రాష్ట్ర బీజేపీ ఒకటి చెప్తూ ద్వంద్వ నీతితో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇతరులకు నీతిసూత్రాలు చెప్పే ముందు, వాటిని ఆచరించడం నేర్చుకోవాలని హితవుపలికారు. మోదీ అబద్ధాల పుట్ట అని, అసత్యాలు మాట్లాడే చరిత్ర వారిదని మండిపడ్డారు. ఇటీవల మూడు వ్యవసాయ చట్టాలపై ఎంతసేపు చర్చించారని నిలదీశారు. మూడు నిమిషాల్లోనే వాటిని పాస్ చేయించుకొన్నారని తెలిపారు. ‘మీరా తెలంగాణకు నీతి సూత్రాలు చెప్పేది.. ముందు బీజేపీ నేతలు, మోదీ ఈ నీతిసూత్రాలను ఆచరించి ఇతరులకు చెప్పాలి’ అని హితవుపలికారు. గురువారం కరీంనగర్‌లోని శ్వేత హోటల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించిన బండి సంజయ్‌కి, అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అని నిలదీశారు. సంజయ్ ఏమైనా అక్కడ ఉన్నారా? ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు వారి వెంట ఉన్న జితేందర్‌రెడ్డిని అడిగితే చెప్తారన్నారు. తెలంగాణ బిల్లు సభలోకి వచ్చిన రోజు ఉదయం 8:30 గంటలకు కేసీఆర్‌తోపాటు తాను, జితేందర్‌రెడ్డి, కేశవరావు అనుక్షణం పార్లమెంటులో జరుగుతున్న విషయాలపై వివిధ పార్టీల నేతల వద్దకు వెళ్తూ చర్చిస్తూనే ఉన్నామన్నారు. చర్చ జరిగినప్పుడు సభల్లోనే ఉన్నామని స్పష్టంచేశారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు నమ్మకం కలిగించేలా అనేక ప్రైవేటు సవరణలు కోరారని, వాటికి రాజ్యసభ అనుమతి ఇచ్చి ఉంటే లోక్‌సభలో మళ్లీ రాష్ట్ర బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉండేది కాదని చెప్పారు. దీనిపై ఆ సమయంలో బీజేపీ నాయకులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ వద్దకు వెళ్లి మాట్లాడటంతోపాటు పార్లమెంటు సెంట్రల్ హాల్లో అన్ని పార్టీల నాయకులతో మాట్లాడుతూనే ఉన్నామని గుర్తుచేశారు. ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేసుకొంటే తమకు సంబంధం లేదని, కానీ రాష్ట్ర ఏర్పాటుపై అక్కసు ఎందుకు వెళ్లగక్కుతున్నారో? చెప్పాలని ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రతి బిల్లు పాస్ చేసే సమయంలో తలుపులు మూసి ఓటింగ్ పెడతారని తెలియదా? అని నిలదీశారు. ఓ వైపు మోదీ తెలంగాణకు అనుకూలం అంటూనే అకసు వెళ్లగకడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ అసలు తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా? స్పష్టం చేయాలని డిమాండ్‌చేశారు. చర్చ జరగకుండా తెలంగాణ ఏర్పాటు బిల్లు పాస్ కాలేదని స్పష్టంచేశారు. ఈ బిల్లుపై బీజేపీ నుంచి సుష్మాస్వరాజ్, ఇతర పార్టీల నేతలు మాట్లాడారని వివరించారు. దేశంలోని 28 పార్టీలు తెలంగాణకు మద్దతు ఇచ్చాయని, అనేక కమిటీలు వేసి అభిప్రాయాలు తీసుకొన్నారని గుర్తుచేశారు. ఆ నాడు పార్లమెంటులో ఉన్న సభ్యుల్లో 95 శాతం మంది సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఆ నాడు ఆహ్వానిస్తామంటే ప్రధాని వద్దనలేదా?
ఇటీవల మోదీ రాష్ర్టానికి వచ్చినప్పుడు సీఎం ఆహ్వానించలేదని విమర్శలు చేస్తున్న బీజేపీ, కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టిన తెలంగాణలోని భారత్ బయోటెక్ కంపెనీ సందర్శన సందర్భంగా ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని, కానీ, మరుసటి రోజే ఎవరూ రానవసరం లేదని, తాను ఒక్కడినే వ్యాక్సిన్ కంపెనీలకు వెళ్తానని మోదీ సమాచారం ఇచ్చారని గుర్తుచేశారు. ఆ నాడు సీఎం కేసీఆర్‌ను ప్రధాని మోదీ వద్దన్నప్పుడు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.