నిజామాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అభాగ్యులకు అండగా ఉండేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేందుకు ప్రధాని నరేంద్రమోదీ కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఉచితాలు అంటూ అనుచిత ప్రకటనలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులు తెలంగాణలో కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని, కల్పించుకొని మరీ లొల్లి చేస్తున్నారని ఆరోపించారు. రేషన్ దుకాణాల్లో మోదీ ఫొటో పెట్టాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దబాయించడం సరికాదని, స్వాతంత్య్రం తర్వాత ఏ ఒక్క ప్రధాని ఫొటో రేషన్ దుకాణంలో పెట్టలేదని స్పష్టంచేశారు.
బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ కవిత లబ్ధిదారులకు కొత్త ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంతకు ముందు నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఇటీవల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పర్యటనల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవహరించిన తీరును ఖండించారు. కేంద్ర మంత్రి హోదాలో ఓ కలెక్టర్‌తో ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. పేదోడి వంటింట్లో మంటపెట్టిన మోదీ ఫొటోలను సిలిండర్ల మీద, పెట్రోల్ బంకుల్లో పెడతామని చురకలంటించారు. కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి కొత్త పంచాయితీలు పెడుతున్నారని మండిపడ్డారు.
ఉచితం వద్దంటూ మోదీ అనుచిత ప్రవర్తన
బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన తన సన్నిహితులు, మిత్రులకు 10 లక్షల కోట్లకు పైగా దేశ సంపదను పంచిపెట్టిన ప్రధాని మోదీ.. సంక్షేమ పథకాలను ఉచితాలు అంటూ అనుచితంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కుట్రపూరితంగా మోదీ ప్రభుత్వం కావాలనే ఉచితం పేరుతో చర్చను లేవదీసిందని ఆరోపించారు. బీజేపీ చేసే అసత్య ప్రచారాల పట్ల మహిళలు, యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రజల కష్టాలను అర్థం చేసుకొనేది కేసీఆరే..
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. వయసు మీద పడినవారు, భర్తలను కోల్పోయిన వారు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికి పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణేనని స్పష్టంచేశారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకొనే మనసు కేసీఆర్‌కు మాత్రమే ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. పేదలకు పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కక్ష? అని ప్రశ్నించారు.