Vizag Steel Plant | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ప్రైవేటీకరణే ఏకైక మంత్రంగా పనిచేస్తున్న మోదీ సర్కారు.. తాను పట్టిన పట్టు సాధించేందుకు ఎంతదూరమైనా వెళ్తున్నది. ఎంతదూరమంటే ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న సంస్థలను మరో ప్రభుత్వరంగ సంస్థగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ కొనుగోలు చేయాలనుకొంటే ఎంతమాత్రం వీలు లేకుండా నిబంధనలు రూపొందించింది. అంటే మోదీ సర్కారు ఒక పీఎస్యూను అమ్మకానికి పెడితే తాహతు, స్థోమత, అవకాశం, ఆసక్తి ఉన్నా మరో ప్రభుత్వరంగ సంస్థ కొనలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇదే జరిగింది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించిన ఈ సంస్థను కచ్చితంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నది. నిజానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కృషి చేసింది. చివరి క్షణం వరకు అన్ని విధాలుగా ప్రయత్నించింది. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారడంతో బిడ్డింగ్ నుంచి వెనక్కి తగ్గిందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం తన కార్పొరేట్ మిత్రులకు అగ్గువకు అమ్మేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించటంతో, దానిని అడ్డుకోవాలని ప్రయత్నించారు. ప్రైవేటీకరణను నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘మీరు ప్రైవేట్‌కు అమ్మేసినా.. కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మళ్లీ టేకోవర్ చేస్తాం’ అని కూడా హెచ్చరించారు. అయినా మోదీ ప్రభుత్వం చెవికి ఎక్కించుకోలేదు. ప్లాంట్ కనీస విలువను రూ.3,500 కోట్లుగా నిర్ధారించి, ఆసక్తి ఉన్నవారు బిడ్లు వేయాలని కోరింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి సింగరేణి సంస్థ ద్వారా ప్లాంట్ టేకోవర్ చేయడానికి ప్రయత్నాలు చేశారు.
ఈ మేరకు ప్రత్యేక బృందాన్ని పంపి ప్లాంట్ పరిస్థితిపై అధ్యయనం చేయించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ప్రభుత్వరంగ సంస్థల విక్రయానికి వేసే టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వాలుగానీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలుగానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలున్న సంస్థలుగానీ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని కో ఆపరేటివ్ సొసైటీలుగానీ పాల్గొనవద్దని నిబంధనల్లో పేర్కొన్నది. ఒకవేళ ఎవరైనా బిడ్డింగ్‌లో పాల్గొనదలిస్తే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా.. ఇచ్చే పరిస్థితి లేదు. ఈ కారణాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనలేదని అధికారులు తెలిపారు.
ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ తన మిత్రులైన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు మోదీ సర్కారు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. అమ్మదల్చుకొన్న సంస్థను మరే ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థగానీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా, ప్రభుత్వాలుగానీ, ప్రభుత్వాల పరిధిలోని సహకార సంస్థలుగానీ దక్కించుకోకుండా 2022లోనే కచ్చితమైన నిబంధనలు రూపొందించి ఆ ఏడాది ఏప్రిల్ 19న అన్ని రాష్ర్టాలకు సర్క్యులర్ జారీచేసింది. పై సంస్థలతోపాటు ప్రభుత్వాలు పీఎస్‌యూల కొనుగోలు బిడ్డింగ్‌లో పాల్గొనరాదని స్పష్టంగా పేర్కొన్నది. విశాఖ స్టీల్ ప్లాంటు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా సింగరేణికి ఇప్పుడు ఈ నిబంధనలే అడ్డుగా నిలిచాయి.