హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల అన్ని విషయాలలో వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల అంశంలోనూ అదే ధోరణి కనబరుస్తున్నది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనుకకు అన్న చందంగా సాగుతున్నాయి. తెలంగాణకు దాదాపు 25 ప్రాజెక్టులు మంజూరైనా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. బీజేపీ ఏలికలోని గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో రైల్వే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతుండగా.. తెలంగాణలో మాత్రం నత్త వేగంతో కూడా సాగడం లేదు.
కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు, విద్యుదీకరణ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి వంటి పనులు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టే ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తున్న కేంద్రం.. తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చే ప్రాజెక్టులకు మాత్రం మొండిచేయి చూపుతున్నది. ఇక కేటాయింపుల విషయంలో కూడా వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. గత బడ్జెట్లో ఏపీకి రూ.7032 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు రూ.3034 కోట్లు మాత్రమే కేటాయించింది.
నత్తను తలపిస్తున్న ప్రాజెక్టుల నడక
దేవరకద్ర నుంచి కర్ణాటకలోని కృష్ణ రైల్వే స్టేషన్ వరకు 66 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని 1997-98లో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు 25 ఏండ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఇప్పటికి 53 కిలోమీటర్ల మేరకు లైను పూర్తయినట్టు అధికారులు చెప్తున్నారు.
పెండింగ్లో ఉన్న మరికొన్ని ప్రతిపాదనలు
1. కరీంనగర్-మానకొండూర్- హుజూరాబాద్-కాజీపేట్
2. మంచిర్యాల-ఆదిలాబాద్
3. మణుగూర్-రామగుండం
4. నంద్యాల-జడ్చర్ల
5. కోయగూడెం మైన్స్- తడికపూడి
6. భద్రాచలం రోడ్- విశాఖపట్నం
7. హైదరాబాద్-శ్రీశైలం
8. సిద్దిపేట- అక్కన్నపేట్
9. వాషిం-మాహోర్-ఆదిలాబాద్
10. పటాన్చెరు-సంగారెడ్డి
11. పగిడిపల్లి దగ్గర..బైపాస్ లైన్