న్యూఢిల్లీ, నవంబర్ 9: పండగంటే పప్పుబెల్లాలు, కొత్తబట్టలు అని పిల్లలలు తెగ సరదా పడిపోతారు. ప్రధాని మోదీకి కూడా ప్రారంభోత్సవాలంటే అలాంటి సరదాయే ఉన్నట్టు అనిపిస్తుంది. రకరకాల డ్రెస్సులు వేసుకోవచ్చు, కెమెరాలకు రకరకాలుగా పోజులు ఇవ్వచ్చు. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ‘ఇది చేశాం.. అది చేశాం’ అని డబ్బా కొట్టుకోవచ్చు. మరి కొత్త ప్రారంభోత్సవాలు ఏవీ అందుబాటులో లేకపోతే ఆయన పాతవాటికే మళ్లీమళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తుంటారు.
ఎప్పుడో ప్రారంభించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ఇప్పుడు మళ్లీ రిబ్బన్ కట్ చేస్తానంటూ.. అర్జంటుగా జాతికి అంకితం చేస్తానంటూ ఆయన ఢిల్లీ నుంచి పరుగెత్తుకు రావడం చూసి ఏమనుకోవాలి మరి? ఆయన ఈతరహా ప్రచార కండూతిని చాటే ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. బెంగళూరు యూనివర్సిటీ క్యాంపస్లో డాక్టర్ అంబేద్కర్ ఎకనమిక్స్ స్కూల్ భవనాన్ని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ప్రారంభించి, మూడు బ్యాచీలు బయటకు వచ్చిన తర్వాత మోదీ ప్రారంభోత్సవం చేయడం చూసి కర్ణాటక ప్రజలు నవ్వుకొన్నారు. వందేభారత్ ఎక్స్ప్రెస్కు నాలుగోసారి జెండా ఊపారు.
మూడుచోట్ల ఇదే రైలును ప్రారంభించారు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న హిమాచల్లో మరో వందేభారత్ ప్రారంభం.. మోదీ సారు జెండా పట్టుకొని తయ్యారు. ఇలా ఒకేరకం రైలుకు దేశంలో నాలుగు చోట్ల జెండాలు ఊపిన ఘనత మోదీ దక్కించుకొన్నారు. అంతటితో ఆగితే మోదీ ఎందుకవుతారు? మైసూరు, చెన్నై వందేభారత్ కూడా లైన్లో ఉంది. రేపు 11న దానికీ జెండా ఊపుతారట. హిమాచల్ ఎన్నికల పుణ్యమా అని ఊనా ఐఐటీని అర్జంటుగా జాతికి అంకితమిచ్చేశారు మోదీ సారు. ఇక అహ్మదాబాద్ మెట్రోను సెగ్మెంట్ల వారీగా ప్రారంభించి సరదా తీర్చుకొన్నారు.
అంటే ఒక్కో సెగ్మెంట్ పూర్తయితే ఆయన వెళ్లి ప్రారంభిస్తారన్నమాట. కోల్కతాలో చిత్తరంజన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రెండో క్యాంపస్ ప్రారంభోత్సవం ఓ ప్రహసనంలా జరిగింది. గత జనవరిలో మోదీ దానిని వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర నిధులతో కట్టామని మార్కులు కొట్టేసే ప్రయత్నంలో భాగంగా అది ఏర్పాటైంది. మరి మోదీ తలుచుకొంటే ప్రారంభోత్సవాలకు కొదువా? అదే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మమతాబెనర్జీ ఆ క్యాంపస్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం వాటా భరించినందున తాము అప్పట్లోనే దానిని ప్రారంభించేసుకున్నట్టు అసలు సంగతి బైటపెట్టారు. కానీ మోదీ మరోసారి ప్రారంభోత్సవం జరిపి అభాసుపాలయ్యారు.