తెలంగాణపై అంత అక్కసు ఎందుకు?
సంస్థల విభజనకు పరిష్కారం చూపరెందుకు?
ఏపీ వైఖరిపై ఫిర్యాదును పట్టించుకోరెందుకు?
కేంద్రం తీరుతో తీవ్రంగా నష్టపోతున్న రాష్ట్రం
హైదరాబాద్, ఫిబ్రవరి 20 : తెలంగాణ ఏర్పడటమే బీజేపీకి నచ్చదు.. అందుకే విభజనను తప్పుపడుతున్నది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతున్నది. అందుకే హామీలను అటుకుపై పడేసింది. తెలంగాణ అంటే బీజేపీకి కక్ష.. చూపుతున్నది వివక్ష. ఒక్క అంశమో, రెండు అంశాల్లోనో కాదు.. అన్ని రంగాల్లో రాష్ట్రంపై తన అక్కసు వెళ్లగక్కుతున్నది. రాష్ర్టాభివృద్ధిని ఓర్వలేక అన్నింటా అడ్డు పడుతున్నది. విభజన చట్టం ప్రకారం చేయాల్సిన ఉమ్మడి సంస్థల విభజనను కూడా చేపట్టడం లేదు. మెజారిటీగా ఉన్న ఏపీ సర్కారు ఆయా సంస్థల విభజనపై ఏకపక్షంగా వ్యవహరించి తెలంగాణకు తీరని నష్టం కలిగేలా చేసింది. దీనిపై 2016లోనే తమకు అన్యాయం జరుగుతున్నదని, జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఆయా సంస్థల విభజన చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసింది. కానీ కేంద్రం ఇప్పటి వరకు చొరవ తీసుకోలేదు. తండ్రి పాత్ర పోషించి సక్రమంగా విభజన చేయాల్సిన మోదీ సర్కారు.. మోడులా తయారైంది. అడపాదడపా సమావేశాలు నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తున్నది. దాదాపు 22 సంస్థలకు చెందిన ఆస్తుల విభజన పూర్తి కాలేదు. దీంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతున్నది. ముఖ్యంగా భారీ ఎత్తున ఆస్తులున్న ఆర్థిక సంస్థ, ఆర్టీసీ, దిల్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి సంస్థల విభజన ముందుకు సాగడం లేదు.
విభజన కాని ఆర్థిక సంస్థ
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బోర్డులో తెలంగాణ ప్రాతినిధ్యం లేకుండా చేసి ఏకపక్షంగా విభజన తీర్మానం చేసి.. దాన్ని ఆమోదించాలని ఏపీ కేంద్రానికి పంపింది. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేసిన తెలంగాణ.. సెక్షన్ 71 (బీ) ప్రకారం భారత ప్రభుత్వ అధికారాలతో తెలంగాణకు సమాన ప్రాతినిధ్యాలు ఉండేలా బోర్డును పునర్నిర్మించాలని 2016లో కేంద్రానికి లేఖ రాసింది. ఇప్పటికీ స్పందన లేదు. ఈ నెల 17న జరిగిన సబ్‌కమిటీ సమావేశంలోనూ కేంద్రం మౌనం వహించింది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆర్థిక సంస్థ భూములను స్వాహా చేయడానికి ఏపీ ఏకపక్ష నిర్ణయంతో కుట్ర పన్నింది. సమస్య పరిష్కరించాల్సిన కేంద్రం మిన్నకుండటంతో భూములు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిధుల పంపకాలు జరగలేదు.
ఆర్టీసీ, దిల్, ఏపీ డెయిరీలదీ అదే పరిస్థితి
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో భారీ విలువ కలిగిన ఆస్తులపై కన్నేసిన ఏపీ సర్కారు.. విభజన చట్టానికి భిన్నంగా తెలంగాణ జిల్లాల్లోని ఆస్తుల్లో వాటా కావాలని భీష్మించుకొని కూర్చున్నది. చట్టప్రకారం ఒక్క కేంద్రపరిపాలన భవనంలోనే వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా ఆపరేషనల్ యూనిట్లు, ఖాళీ భూముల్లో వాటాలు కోరుతున్న తీరుపై 2016లో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఇప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. ఫలితంగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని దాదాపు 5 వేల ఎకరాల దిల్ భూములను తెలంగాణ ప్రభుత్వం ప్రజావసరాలకు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ, డెయిరీలతో పాటు 22 సంస్థలకు చెందిన విభజనను కేంద్రం చేయవచ్చు. కానీ తొలి నుంచి తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం.. రెండు రాష్ర్టాల మధ్య విభేదాలను పెంచి పోషిస్తున్నది.