కేంద్ర ప్రభుత్వం అబద్ధాల ఫ్యాక్టరీలు పెట్టడమే తప్ప అసలు ఫ్యాక్టరీలు పెట్టడం లేదు. ఇప్పటికే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గొంతు కోయగా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఊపిరిపోయకుండానే ఉసురు తీస్తున్నది. – మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 20 : బయ్యారం ఉకు కర్మాగారం నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత వైఖరిపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. నాణ్యమైన ఇనుప ఖనిజ సంపద అందుబాటులో ఉన్నా కేంద్రప్రభుత్వ సంకల్ప లోపమే బయ్యారం ప్లాంట్ నిర్మాణానికి శాపంగా మారిందని ఆరోపించారు. బయ్యారం ఉకు కర్మాగారం విషయంలో కేంద్రానిది తుక్కు సంకల్పమని, మోదీ సర్కారు వైఖరిని ఎండగడుతూ ఆదివారం కేంద్ర స్టీల్ శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్‌కు ఘాటు లేఖ రాశారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేది రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దకిన హామీ అని, బయ్యారం ఉకు తెలంగాణ హకు అని లేఖలో పేర్కొన్నారు. నిండు పార్లమెంట్లో భారత ప్రభుత్వం ఒప్పుకొన్న నిర్ణయాన్ని మోదీ సర్కారు తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయంగా దకాల్సిన ఎన్నో విభజన హామీలను పకన పెట్టినట్టుగానే బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్నీ బీజేపీ సర్కారు కావాలని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సుమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల అపార ఇనుప ఖనిజ నిల్వలు బయ్యారంలో ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని.. దాన్ని పక్కనబెడుతూ బయ్యారంలో నాణ్యమైన ఐరన్ ఓర్ లేదని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నదని మండిపడ్డారు. బయ్యారంలో సరిపడా నాణ్యమైన నిల్వలు లేకపోవడమే కారణం అయితే, కేవలం 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బైలాడిల్లలో గనులు కేటాయించాలని కోరిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. అకడి నుంచి బయ్యారానికి ఐరన్ ఓర్ రవాణా చేసేందుకు ఒక స్లర్రి పైపులైన్ లేదా రైల్వే లైన్ వేస్తే సరిపోతుందని స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారని, తాను సైతం పలుమార్లు కేంద్రమంత్రులను కలసి ప్లాంట్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేశానని పేర్కొన్నారు.
వాటికి రూ.71 వేల కోట్లు ఎలా?
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోని మోదీ ప్రభుత్వం.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని రూరెలా, బర్న్‌పూర్, దుర్గాపూర్, బొకారో, సాలెం తదితర ప్లాంట్ల విస్తరణ, ఆధునీకరణ, గనుల కోసం మాత్రం రూ.71 వేల కోట్లు ఖర్చు చేసిందని కేటీఆర్ విమర్శించారు. పాత కర్మాగారాల ఆధునీకరణ ఆహ్వానించదగ్గదే అయినా.. రూ. వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశాక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన ఎన్ఎండీసీ సంబురాల్లో పాల్గొన్న అప్పటి కేంద్ర స్టీల్ శాఖ మంత్రి బీరేంద్రసింగ్.. కొత్తగూడెం, పాల్వంచలో పెల్లెటైజేషన్ ప్లాంట్, స్రాప్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్రం అబద్ధాల ఫ్యాక్టరీలు పెట్టడమే తప్ప అసలు ఫ్యాక్టరీలు పెట్టడం లేదని విమర్శించారు. నిన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గొంతు కోసిన కేంద్రం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఊపిరిపోయకుండానే ఉసురు తీస్తున్నదని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనపైనా తన లేఖలో కేటీఆర్ దుయ్యబట్టారు. కిషన్‌రెడ్డి ప్రకటనతో బయ్యారంపై బీజేపీ బండారం బయటపడిందని తెలిపారు. బయ్యారం ఉకుపై కేంద్ర ప్రభుత్వానిది తుకు సంకల్పమే అని తేలిపోయిందని విమర్శించారు.
కేంద్రం నుంచి ఉలుకూపలుకూ లేదు
రవాణా ఏర్పాటుకు అవసరమయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం పంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పినా మోదీ సర్కారు నుంచి ఉలుకూపలుకూ లేదని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లోని గనుల నుంచి బయ్యారం ప్లాంట్‌కు ఐరన్ ఓర్ సరఫరా చేసేందుకు 2016లోనే ఎన్ఎండీసీ అంగీకరించిందని గుర్తు చేశారు. దీంతోపాటు మెటలర్జికల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ (మేకాన్) సంస్థ.. ఖమ్మం పరిసర ప్రాంతాలను అధ్యయనం చేసి పెల్లెటైజేషన్ ప్లాంట్, స్రాప్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సానుకూల నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఎన్ఎండీసీ, సింగరేణి కాలరీస్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సానుకూలంగా స్పందించినా కేంద్రం మాత్రం బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటుపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ఫైర్ అయ్యారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో స్టీల్ ప్లాంట్ల నిర్మాణాలకు కేంద్రం, ఎన్ఎండీసీ, స్థానిక ప్రభుత్వాలతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటైన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రస్తుతం వీలుకాకుంటే, తాతాలికంగా పెల్లెటైజేషన్ ప్లాంట్ పెట్టి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనీ కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఇన్ని రకాలుగా విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని అనటానికి ఇంతకంటే రుజువులు అవసరం లేదని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనను ప్రధాని మోదీ తప్పుబడితే, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి విభజన హామీలను తప్పు పడుతున్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణకు ద్రోహమే. రాష్ట్ర ప్రయోజనాలకు సహాయం చేయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిస్సహాయ మంత్రే.
– మంత్రి కేటీఆర్
తెలంగాణకు ద్రోహం
రాష్ట్ర విభజనను ప్రధాని మోదీ తప్పుబడితే, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి విభజన హామీలను తప్పుపడుతున్నారని, ఇది ముమ్మాటికీ తెలంగాణకు ద్రోహమే అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ నుంచి ఎన్నికైన మంత్రి హకులు సాధించాల్సిందిపోయి చికులున్నాయంటూ చేతులెత్తేస్తారా? అని ప్రశ్నించారు.
స్టీల్ ఫ్యాక్టరీని సాధించాల్సిన కేంద్రమంత్రే బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటు లాభసాటి కాదని, ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని చేతులెత్తేయటం ఏమిటని నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాలకు సహాయం చేయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిస్సహాయ మంత్రేనని కేటీఆర్ విమర్శించారు.
కిషన్ రెడ్డి మాటలు వ్యక్తిగతమా లేక కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయమా అన్నది తెలపాలని కేంద్రమంత్రి స్టీల్ శాఖ మంత్రిని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిన్న ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్రం సహాయం చేయలేదని, నేడు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో తమకు ఉద్యోగాలు వస్తాయనుకొంటున్న వేలాది గిరిజన, అదివాసీ యువకుల ఉపాధి ఆశలకు గండి కొడుతున్నదని ఆరోపించారు. యువకుల ఆశలకు కిషన్ రెడ్డి ఉరి వేశారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు, హకులను సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తూనే ఉంటుందని, ఈ దిశగా కేంద్రం నుంచి సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ పట్ల వివక్షాపూరిత వైఖరిని వీడనాడి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.