యాదాద్రి భువనగిరి : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైందని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిగూడెం మండలం దేవర భీమనపల్లి గ్రామ యువకులతో మంత్రి సమావేశమయ్యారు. కార్మిక, కర్షక, పేదల వ్యతిరేక విధానాలను బీజేపీ ప్రభుత్వం అమలుచేస్తున్నదని మండిపడ్డారు.
ఎనిమిదేళ్లలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందకుండా పోయాయని పేర్కొన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నదని,మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. గడిచిన ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ , అభివృద్ధి పనులు చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి బీజేపీకి బుద్ధి చెప్పాలని, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.