Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 30 ( నమస్తే తెలంగాణ ) : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కారు కలిసి బనకచర్ల డ్రామాలో తెలంగాణను నిండా ముంచేందుకు మరిన్ని కుట్ర వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రాణహిత జలాలను తన్నుకుపోవడంతోపాటు తెలంగాణ హక్కులను కాలరాసేందుకు పోలవరంపై దాగుడుమూతలు ఆడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చారిత్రక ఒప్పందాల్లో భాగంగా మన రాష్ర్టానికి దాఖలు పడాల్సిన హక్కులను నెరవేర్చకుండా.. కీలకమైన ముంపు సమస్యలను తీర్చకుండానే నీటిని నిల్వ చేసేందుకు గుట్టుగా పావులు కదుపుతున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణాలో ఎగువ రాష్ర్టాల హక్కులను నెరవేర్చిన కేంద్రం.. ముంపు వ్యవహారంలో ఫోర్‌షోర్ రాష్ర్టాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాల సమస్యలను పరిష్కరించేందుకు ఆసక్తి చూపుతున్నది.
కానీ, తెలంగాణ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందనే వాస్తవాన్ని అటు కేంద్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ విస్మరిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సైతం తెల్లారింది మొదలు బీఆర్ఎస్ను రాజకీయంగా బద్నాం చేయడంపైనే దృష్టిసారిస్తుందేగానీ పోలవరంలో నీటిని నిల్వ చేసే ముందు రాష్ర్టానికి రావాల్సిన న్యాయపరమైన వాటాలు, ముంపు సమస్యల పరిష్కారాలపై మాత్రం గళం విప్పడం లేదు. దీన్ని అలుసుగా తీసుకొనే తొలుత పోలవరం… ఆపై బనకచర్లను ఒడ్డున పడేసేందుకు చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తాను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదంటూ అబద్ధాలాడిన చంద్రబాబు తెలంగాణ హక్కులను ఏమేరకు అమలుచేస్తారో చెప్పాలని తెలంగాణవాదులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సమైక్య పాలకులు చివరకు తెలంగాణ ప్రయోజనాలను సైతం పణంగా పెట్టారు. ప్రధానంగా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడంతోపాటు పూర్తిస్థాయి నీటి నిల్వ స్థాయి (ఎఫ్ఆర్ఎల్)ని 150 అడుగులుగా నిర్ధారించేందుకు సంబంధిత రాష్ర్టాలను సంతృప్తిపరిచేందుకు ఆయా రాష్ర్టాలకు అనేక ప్రయోజనాలను కల్పించారు. ఆ మేరకు బచావత్ ట్రిబ్యునల్‌లో, పోలవరంపై 2.4.1980న కుదిరిన ఒప్పందంలో వాటిని పొందుపరిచారు. కానీ, అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నందున తెలంగాణ ప్రాంతం అటు కృష్ణాలో వాటాపరంగా హక్కును సాధించలేకపోవడం, ఇటు గోదావరిలో ముంపుపరంగా ప్రశ్నించే పరిస్థితులు లేకుండాపోయాయి. చివరకు రాష్ట్ర విభజనను అడ్డుపెట్టుకొని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో భాగంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది.
తదనంతరం వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మాణంతోపాటు సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అండగా నిలుస్తూ, తెలంగాణను విస్మరిస్తూ వస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లపాటు హక్కులు, సమస్యల పరిష్కారంపై గళం వినిపిస్తూ, కేంద్రం మీద కూడా ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చినా మోదీ ప్రభుత్వం దాటవేస్తూ వచ్చింది. తెలంగాణ బీజేపీ నేతలు చివరకు కేంద్ర మంత్రి, ఎంపీ పదవుల్లో ఉన్నా ఏ ఒక్కనాడూ వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే ఎన్నాళ్లుగానో గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై తహతహలాడుతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. వచ్చే ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో మేడిగడ్డను ఎండబెట్టడం, ఏపీలో చంద్రబాబు తోడవడంతో బనకచర్లను తెరపైకి తెచ్చారు. చంద్రబాబు బనకచర్లకు ప్రాణహితను తరలించాలన్నా.. మోదీ కావేరికి గోదావరిని తన్నుకుపోవాలన్నా ముందుగా పోలవరం ప్రాజెక్టులో నిల్వ అనేది కీలకం. అందుకే పోలవరం ముంపు సమస్యల చిక్కుముళ్లను విప్పేందుకు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
కృష్ణా, గోదావరి ట్రిబ్యునళ్లకు చైర్మన్‌గా బచావత్ వ్యవహరించారు. ఈ క్రమంలో పోలవరంలో భాగంగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించడంపై జరిగిన వాదనల ఫలితంగా కర్ణాటక, మహారాష్ట్రను సంతృప్తిపరిచేందుకు ఒక క్లాజ్‌ను రూపొందించారు. పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నందున ఆ మేరకు కృష్ణాజలాల్లో కృష్ణా డెల్టాకు ఎగువన ఉన్న రాష్ర్టాలకు 80 టీఎంసీల హక్కును కల్పించాలని నిర్ణయించారు. ఎగువన ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నందున ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీల చొప్పున హక్కు కల్పించారు. పోలవరం ప్రాజెక్టు పనులు మొదలైన వెంటనే ఈ హక్కులు దఖలుపడతాయని బచావత్ ట్రిబ్యునల్‌లో పొందుపరిచారు. అయితే, ఆ సమయంలో తెలంగాణ ఉమ్మడి ఏపీలో ఉన్నది. పోలవరం ద్వారా ఏపీకి ప్రయోజనం.. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన దరిమిలా న్యాయబద్ధంగా 45 టీఎంసీలు తెలంగాణకు దక్కాలి.
బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 36 లక్షల క్యూసెకుల వరదకు సంబంధించి మాత్రమే పోలవరం ఎగువన ఉన్న ప్రాదేశిక ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనాన్ని సీడబ్ల్యూసీ చేయించింది. అప్పుడు డ్యామ్ డిశ్చార్జి స్థాయిని 140 అడుగుల (42.67 మీటర్లు) నుంచి 135.05 అడుగులు (41.15 మీటర్లు)గా నిర్ధారించింది. ప్రస్తుతం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెకులకు డిజైన్ చేసింది. వరద డిశ్చార్జి స్థాయిని కూడా 140 అడుగులు కాకుండా 148.5 అడుగుల (45.26 మీ)గా నిర్ధారించింది. దానివల్ల ముంపు మరింత పెరగనున్నది. ఏదైనా ప్రాజెక్టుకు స్పిల్‌వే డిజైన్ మార్పు జరిగినప్పుడు మరోసారి అందుకు సంబంధించి బ్యాక్ వాటర్ ప్రభావం అంచనాకు అధ్యయనం చేయడం తప్పనిసరి. ఆల్మట్టి ఆనకట్టకు సంబంధించి మహారాష్ట్ర భూభాగంలో ప్రభావాన్ని అంచనా వేసేందుకు అధ్యయనం చేసి, ఎలాంటి ప్రభావం ఉండబోదని నిర్ధారించుకున్న తర్వాతే మహారాష్ట్ర ఆ ప్రాజెక్టుకు సమ్మతి తెలిపింది. అదేరీతిన పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపైనా అధ్యయనం చేయించడమనేది కేంద్రం-ఏపీ కనీస కర్తవ్యం. ఆ మేరకు వచ్చే సమస్యల్ని పరిష్కరించాలి.
పోలవరంలో నీటి నిల్వకు ఏపీ ఉపక్రమిస్తున్నందున ఆ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న తెలంగాణ అంశాలను వెంటనే తేల్చుకోవాలని నిపుణులు చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మేరకు పోరాడినా… ఇప్పుడు అనువైన, కీలక సమయం వచ్చినందున వాటిని నెరవేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబట్టాలని, లేనిపక్షంలో అంగీకరించవద్దని సూచిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు ఒప్పంద సమయంలోనే ముంపునకు గురవుతున్న మధ్యప్రదేశ్ (ఇప్పటి ఛత్తీస్‌గఢ్), ఒడిశా రాష్ర్టాలకు ఊరట కల్పించేందుకు ఫోర్‌షోర్ నీటి హక్కు కల్పించారు. పోలవరంలో నీటి నిల్వ వల్ల ఆయా రాష్ర్టాల్లోని భూములు మునుగుతాయి. దీంతో ఆయా రాష్ర్టాలను సంతృప్తిపరిచేందుకు ఫోర్‌షోర్ నుంచి ఛత్తీస్‌గఢ్ 1.5 టీఎంసీలు, ఒడిశా 5 టీఎంసీలు లిఫ్టు చేసుకునేందుకు హక్కు కల్పించారు.
ఆ నీటిని ఆయా రాష్ర్టాలు ఎక్కడికైనా తరలించుకోవచ్చు. అయితే, ఒప్పంద సమయంలో తెలంగాణ అనేది ఏపీలో అంతర్భాగం. కానీ, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం. పైగా తెలంగాణకూ ముంపు సమస్య ఉన్నది. అందుకే ప్రత్యేక రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాతోపాటు తెలంగాణకూ సమాన హక్కులు దక్కాలి. ఈ క్రమంలో కచ్చితంగా ఫోర్‌షోర్‌లో తెలంగాణ కనీసంగా 10 టీఎంసీలనైనా నీటిని లిఫ్టు చేసుకునే హక్కు కల్పించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం, ఏపీ ఇందుకు అంగీకరిస్తే ట్రిబ్యునల్ ఆమోదం లాంఛనమే అనేందుకు గోదావరి ట్రిబ్యునల్ పెద్ద ఉదాహరణ.