దేవరుప్పుల, మార్చి 2: పాఠశాలలకు పూర్వవైభవం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇందుకోసం రూ.7,200 కోట్లతో సౌకర్యాలు కల్పించనున్నదని చెప్పారు. బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని రామరాజుపల్లిలో నిర్వహించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలను అభివృద్ధి చేయగా ఇప్పుడు పాఠశాలల వంతు వచ్చిందన్నారు. మూడు విడుతల్లో రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని నిర్వహించి ఆంగ్లభాషలో ఉత్తమ విద్యను అందించనున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల జోలికి పోకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించేలా చూడాలన్నారు. మరోవైపు పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, గ్రామానికి చెందిన వారు విరాళాలు సమకూర్చి పాఠశాలలకు అందిస్తే మరింత అభివృద్ధిని చూస్తామన్నారు. దాతల పేర్లు, ఫొటోలు పాఠశాలల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాఠశాలల రూపురేఖలే మారుతాయని చెప్పారు. రామరాజుపల్లి పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, అధునాతన మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నిచర్, డైనింగ్ హాల్, ఇతరత్రా వాటికి రూ.కోటి నిధులు కేటాయిస్తామన్నారు. కాగా గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి బండి నర్సింహులు రూ.25 వేల విరాళాన్ని ప్రకటించడంతో మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.