హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వారం రోజులుగా ఒకవైపు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయని హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉన్నదని, దీని ప్రభావంతో ఏప్రిల్ 3 వరకు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ముఖ్యంగా మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మలాజిగిరి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదేవిధంగా వచ్చే మూడ్రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. శనివారం పది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వివరించింది. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోస్రాలో 40.5 డిగ్రీలు నమోదు కాగా, జగిత్యాల, నల్లగొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో 40.4 డిగ్రీలు, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 40.2 డిగ్రీలు, జోగులాంబ 40.1, గద్వాల 40.1, ఆదిలాబాద్ , జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయని వెల్లడించింది.