హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం బుధవారం బలపడి తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇది రానున్న 24గంటల్లో జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాబోయే రెండ్రోజులు కురుస్తాయని వెల్లడించింది.
బుధవారం ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయని వివరించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొన్నది. జూన్ 1నుంచి సెప్టెంబర్ 3వరకు రాష్ట్రంలో సాధారణ సగటు వర్షపాతం 593 మి.మీ కురవాల్సి ఉండగా.. బుధవారం వరకు 757.5 మి.మీ వర్షపాతం కురిసినట్టు వెల్లడించింది.