హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ నైరుతి నుంచి వీస్తున్న గాలులతో జూలై 3 వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొన్నది. నేడు రాష్ట్రంలోని కుమ్రంభీంఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. ఆదివారం ములుగు, జయశంకర్భూపాలపల్లి, వనపర్తి, మహబూబ్‌నగర్, జోగులాంబగద్వాల జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసినట్టు వెల్లడించింది. జూన్‌లో హైదరాబాద్, మేడ్చల్, జనగామ జిల్లాల్లో 114 మండలాల్లో తీవ్ర లోటు, 20 జిల్లాల్లోని 275 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు వివరించారు.
‘జీవో పేరుతో జీతాలు బంద్’కు స్పందన
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవలందిస్తున్న కాంట్రాక్ట్ వైద్యుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ‘జీవో పేరుతో జీతాలు బంద్’ శీర్షికన ప్రచురించిన కథనానికి డీఎంఈ స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రులకు చెందిన దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న 4,772 మంది కాంట్రాక్ట్ వైద్యులు, 8,615 మంది ఔట్సోర్సింగ్ వైద్యులు, 3,056 మంది గౌరవ వేతనంతో సేవలందించేవారు, ఐదుగురు ఎంటీఎస్ పద్ధతిలో వైద్యసేవలందిస్తున్నవారి సర్వీస్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడా ది మార్చి 31వరకు పొడిగించినట్టు అధికారులు జీవో జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలను సైతం విడుదల చేయనున్నారు.