హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ‘ఒకటో తేదీనే ఉద్యోగుల వేతనాలేశాం. పెన్షన్లను రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లో జమచేశాం..’ ఇది ప్రభుత్వవర్గాల ప్రకటన. కానీ ఈ ప్రకటనలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టంచేస్తున్నాయి. ప్రభుత్వ హామీలు ఎండమావిని తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని మాడల్ స్కూల్ టీచర్లకు అక్టోబర్నెల వేతనాలు ఇప్పటికీ అందలేదు. ఒకటో తేదీ గడిచిపోయి 18 రోజులవుతున్నది… అయినా వేతనాలు ఖాతాల్లో జమకాలేదు. మాడల్ స్కూళ్లల్లో పనిచేస్తున్నది రెగ్యులర్ టీచర్లే అయినా వీరిపై ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లున్నాయి. వీటిల్లో 5,500 మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రిన్సిపాళ్లు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్లున్నారు. వీరంతా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్ ఈఎంఐలు చెల్లింపులు సరిగా చేయలేకపోవడంతో చెక్‌బౌన్స్ అయి ఇబ్బందులుపడుతున్నట్టు వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 8 నెలలుగా ఏనాడు సమయానికి వేతనాలు అందడంలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
010 పద్దు కింద వేతనాలివ్వాలి
రెగ్యులర్ ఉపాధ్యాయులమైనప్పటికీ ఇప్పటి వరకు మాకు వేతనాలు అందలేదు. 1న వేతనాలిస్తారని ఆశించాం. కానీ ఇంతవరకు వేతనాలు అందకపోవడంతో.. ఈఎంఐ ఇతర అవసరాలకు ఎప్పటిలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 010 పద్దుకింద చేర్చి, ప్రతి నెల 1న వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– భూతం యాకమల్లు, రాష్ట్ర అధ్యక్షుడు, టీఎంఎస్టీఏ
డీఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు
మాడల్ స్కూల్ టీచర్లకు రెగ్యులర్‌గా వేతనాలు అందడంలేదు. 2021 నుంచి 2023 వరకు డీఏ బకాయిలు విడుదల చేయలేదు. 7 పీఆర్సీ బకాయిలు అందలేదు. ఇలా ఒక్కో టీచర్‌కు ప్రభుత్వం రూ.80వేలు బాకీపడింది. రెండేండ్లు దాటినా అందకపోవడం శోచనీయం. మాడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో విలీనం చేసి ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలి.
– జగదీశ్, పీఎంటీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు