సిద్దిపేట టౌన్, డిసెంబర్ 24: పోలీసు శాఖలో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలిపారని హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని పొన్నాల శివారులో రాష్ట్రంలోనే ఆదర్శంగా రూ.10 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన మోడల్ పోలీసు కన్వెన్షన్ సెంటర్‌ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో కలిసి శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ.. ఈ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ హైటెక్ కన్వెన్షన్ సెంటర్‌కు దీటుగా ఉన్నదన్నారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేట హైటెక్ సిటీ తరహా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. కన్వెన్షన్ సెంటర్లు, పెట్రోల్ బంక్‌లను విరివిగా ఏర్పాటు చేసి వాటిపై వచ్చే ఆదాయాన్ని పోలీసుల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. పోలీసు కుటుంబాల పిల్లల చదువుకు, విదేశీ విద్యకు తదితర వాటికి ఈ నిధులు వినియోగిస్తామన్నారు.
పగలూరాత్రి ఎంతో కష్టపడి విధులు నిర్వర్తించే పోలీసులు తమకు ఇది కావాలని ఏనాడూ అడగలేదని, వారి సంక్షేమాన్ని కాంక్షిస్తూ తన కలల ప్రతిరూపమే మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పోలీసుల కోసం అత్యాధునిక హంగులు, సకల వసతులతో సిద్దిపేటలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్టు చెప్పారు. ఈ రకంగా తన సంకల్పం నెరవేరిందన్నారు. సెంటర్ ద్వారా వచ్చే ప్రతి పైసా పోలీసుల సంక్షేమానికే వినియోగిస్తామని స్పష్టం చేశారు. తక్కువ ధరకే వివాహాది శుభకార్యాలు జరుపుకొనేలా అన్ని వసతులను కల్పించినట్టు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో పోలీస్ పెట్రోల్ బంక్‌లు ఏర్పా టు చేసుకొని ఆదాయాన్ని సమకూర్చుకుందామని తెలిపారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పోలీసుల సంక్షేమానికి మరింత కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆశీస్సులతో రాష్ట్రంలో మొదటిసారిగా సకల హంగులు, సౌకర్యాలతో పోలీసు కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించుకున్నట్టు తెలిపారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పోలీసు కన్వెన్షన్ సెంటర్, పెట్రోలు బంక్‌ల ఏర్పాటుకు ప్రత్యేక జీవో జారీ చేసిందన్నారు.