కామారెడ్డి రూరల్ , జూలై 12: కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని టేక్రియాల్ జాతీయ రహదారిపై దారి దోపిడీ జరిగింది. ఓ ట్రక్కు నుంచి రూ.4 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ట్రక్కును డ్రైవర్ శుక్రవారం రాత్రి ఓ దాబా వద్ద నిలిపాడు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత డ్రైవర్ లేచి వాహనం వెనుక చూడగా మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్టు గుర్తించి, వెంటనే దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.