హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలకు ఔషధాలు, వైద్య పరికరాలను సరఫరా చేస్తున్న మెడికల్ సప్లయర్స్‌కు చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయలలో పేరుకుపోతున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. క్యాన్సర్ వ్యాధికి చికిత్సనందించే హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే దవాఖాన ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రూ.35 కోట్లు బకాయిలు ఉన్నట్టు సరఫరాదారులు వాపోతున్నారు. తమ పెండింగ్ బకాయిల సమస్యను సప్లయర్లు ఎన్నిసార్లు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన రావడం లేదు. మరోవైపు ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాకుంటే నిధులు ఎలా విడుదల చేయాలి..? అంటూ అధికారులు సప్లయర్లనే ఎదురు ప్రశ్నిస్తుండటం గమనార్హం. ఈ ఏడాది మూడు త్రైమాసికాల్లో జనరల్ బడ్జెట్‌ను, ఆరోగ్య శ్రీ కింద రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్లనే బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ జాప్యం కారణంగా ఎంఎన్‌జే క్యానర్స్ దవాఖానకు కొత్తగా మందులు, సర్జికల్ ఉత్పత్తులు పంపిణీ చేయడం తమకు భారంగా మారిందని సప్లయర్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఈఎస్ఐ దవాఖానల్లో సైతం రెండేండ్లుగా మందులు, సర్జికల్, డయాగ్నోస్టిక్స్‌కు సంబంధించిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై సప్లయర్లు సీఎం రేవంత్‌రెడ్డికి, కార్మికశాఖ మంత్రికి లేఖలు రాసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో వారు ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ తర్వాత ఈఎస్ఐ వర్గాలు రూ.25 కోట్లకు సంబంధించిన బిల్లులను ఆర్థికశాఖకు నిరుడు అక్టోబర్‌లో పంపారు. ఆర్థిక శాఖ ఆ బిల్లులను ఈ ఏడాది ఏప్రిల్‌లో వెనక్కి పంపింది. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. ఈఎస్ఐసీ రిజీనల్ డైరెక్టర్ ఏడాదిలో తొలి ఆరు నెలలకు రూ.164 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్వో) విడుదల చేయకపోవడంతో చెల్లింపులు జరగలేదు.
కేంద్ర ఆర్థికశాఖ ఫైనాన్షియల్ కోడ్ రూల్‌లో సైతం 30 రోజుల్లో బిల్లులు క్లియర్ చేయాలని లేనిపక్షంలో వడ్డీతో సహా సప్లయర్లకు బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉన్నది. నిబంధనలకు పాతర వేస్తున్న ఉన్నతాధికారులు ఎంఎన్‌జే, ఈఎస్ఐ దవాఖానలకు మందులు, సర్జికల్స్ సరఫరా చేస్తున్న సప్లయర్స్‌ను ఉద్దేశపూర్తకంగానే వేధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను క్లియర్ చేయకపోతే మెడికల్, సర్జికల్, డయాగ్నోస్టిక్‌ల సరఫరా నిలిపివేస్తామనని ‘ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్లు’ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.