హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 10 (నమస్తే తెలంగాణ) : ఎంతో మంది నిరుపేద క్యాన్సర్ రోగులకు పునర్జన్మ ఇస్తున్న ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన ప్రతిష్ట పాలనాధికారి అసమర్థతతో నీరుగారిపోతుందని స్వయానా దవాఖాన సిబ్బందే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాలనపై పట్టులేక, నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోగులే కాకుండా వైద్య సిబ్బందీ ఇబ్బందులు పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిపాలనాధికారి అసమర్థతను ఆసరాగా చేసుకుని కొందరు కిందిస్థాయి ఉద్యోగులు ఆడిందే ఆట, పాడిందే పాటగా చెలరేగిపోతున్నట్టు తెలుస్తున్నది.
దవాఖాన పనితీరు, నెలకొన్న పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లనే ఎంఎన్‌జే దవాఖానలో సమస్యలు క్యాన్సర్ కణాల్లా పెరిగిపోతున్నాయని పలువురు మండిపడుతున్నారు. వైద్యపరికరాలు పనిచేయడం లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకుండా నిర్లక్ష్యం చేయడంతో రోజురోజుకూ సమస్యలు పెరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులను విడుదల చేయించుకునేందుకు ప్రయత్నం చేయకపోవడమే కా కుండా దవాఖానలో ఇంటర్నల్‌గా మంజూరు చేయాల్సిన చిన్నపాటి బిల్లులు కూడా మంజూరు చేయకపోవడంతో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తున్నది. దవాఖానలో చాలాచోట్ల ఏసీలు పనిచేయకపోవడంతో ముఖ్యంగా రేడియేషన్ యంత్రాలు మొరాయిస్తున్నట్టు వినికిడి. ఏడాదిన్నర కాలంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్ సుమారు 30 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఆసుపత్రిలో సీటీ స్కాన్ చేసే ఫిల్మ్‌లు, ఆక్సిజన్ స్థాయిలు పరిశీలించే ఏబీజీ కార్డులు, ఐవీ కాంట్రాస్ట్ ఇంజెక్షన్లు కూడా లేని దౌర్భాగ్యస్థితి.
ఎంఎన్‌జే పాత భవనానికి అర కిలోమీటర్ దూరంలో నూతన భవనాన్ని నిర్మించారు. చికిత్స, వైద్యపరీక్షలపరంగా రోగులు రెండు భవనాలకు తిరగాల్సి ఉంటుంది.అటూఇటూ వచ్చిపోవడంలో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా మూడు బ్యాటరీ వాహనాలు ఏర్పాటుచేశారు. రెండు వాహనాల బ్యాటరీలు డౌన్ కావడంతో నడవడం లేదు.
పరిపాలనాధికారి అసమర్థత, నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని దవాఖానలోని ఒక ఏవో అక్రమ బిల్లుతో అందినంత దండుకునేందుకు యత్నించినట్టు విశ్వసనీయ సమాచారం. దవాఖానలో మొత్తం ఐదుగురు ఏవోలు(అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు) ఉండగా ఇటీవల ఒకరు విరమణ పొందగా నలుగురు పనిచేస్తున్నారు. విరమణ పొందిన అధికారి చేయాల్సిన పనిని అడిషనల్ చార్జ్‌గా నలుగురూ పంచుకోగా అందులో ఒకరు అక్రమ బిల్లులు పెట్టి రూ.1.5లక్షలు దండుకునేందుకు యత్నించినట్లు తెలిసింది. మూడు నెలలుగా తాను అదనపు పని చేస్తున్నట్లు నకిలీ బిల్లులు తయారు చేసి, ప్రొసీడింగ్స్‌ను పంపించగా, ఏమీ చూడకుండా పరిపాలనాధికారి సంతకాలు పెట్టేశారట! విషయం తెలుసుకున్న ఇతర ఏవోలు నిలదీయడంతో నకిలీ బిల్లుల బాగోతం బయటపడడంతో పరిపాలనాధికారి వాటిని ఆపేసినట్టు విశ్వసనీయ సమాచారం.
ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌ను ఆంధ్రాకు చెందిన ఒక రిటైర్డ్ అధికారి తెరవెనుక నుంచి నడిపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 10 ఏండ్లపాటు అక్రమంగా తెలంగాణలో తిష్టవేసి, స్థానిక వైద్యాధికారులకు తీరని అన్యాయం చేసిన ఆంధ్రా అధికారిని ఇటీవలే తెలంగాణ వైద్యులు తరిమికొట్టిన విషయం తెలిసిందే. అలాంటి అధికారితో ఎంఎన్‌జే పరిపాలనాధికారి చేతులు కలిపి రోగులకు తీరని అన్యాయం చేస్తున్నట్లు దవాఖాన వర్గాలు మండిపడుతున్నాయి.