హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): ఎంఎన్‌జే దవాఖానలో పైసా ఖర్చు లేకుడా పేద రోగులకు ఖరీదైన రోబోటిక్ శస్త్రచికిత్సలు చేస్తున్నామని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. దవాఖానలో 100 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఎన్జేలో నిరుడు సెప్టెంబర్ నుంచి రోబోటిక్ సర్జరీలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
ప్రైవేటులో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ఖరీదైన రోబోటిక్ సర్జరీలను ఎనిమిది నెలల కాలంలో ఎంఎన్జేలో పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా విజయవంతంగా చేస్తున్నట్టు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. శరీర భాగాల్లో ఏర్పడిన క్యాన్సర్ ట్యూమర్లను ఈ రోబోటిక్ ద్వారా అతి సులభంగా, సురక్షితంగా తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. సర్జరీ జరిగిన తరువాత కూడా రోగులకు తదనంతర చికిత్సను ఉచితంగానే అందిస్తున్నట్టు పేర్కొన్నారు. వైద్యవిద్యలో భాగంగా పీజీ అనంతరం సూపర్‌స్పెషాలిటీ కోర్సు చదివే ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజి విద్యార్థులకు రోబోటిక్ సర్జరీలపై పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు ఎంఎన్‌జే డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.