ముషీరాబాద్,ఫిబ్రవరి 17: మాదిగల ఆత్మగౌరవాన్ని మందకృష్ణ మాదిగ వివిధ పార్టీల వద్ద తాకట్టు పెడుతున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. హైదరాబాద్ విద్యానగర్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఆత్మగౌరవ ఉద్యమాన్ని బానిసత్వంవైపు నడపాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు వర్గీకరణ ఉద్యమాన్నే పక్కనపెట్టి పూటకో పార్టీ వైపు మొగ్గు చూడటమేకాకుండా, నేతల కాళ్లు పట్టుకుంటూ సో యి తప్పి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మందకృష్ణ అండగా నిలుస్తున్న మనువాద బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని పేర్కొన్నారు. సమావేశం లో గణేశ్, వరలక్ష్మి, కొల్లూరి వెంకట్, వెంకటేశ్, ప్రవీణ్, శ్యామ్రావు పాల్గొన్నారు.