హసన్‌పర్తి, జూన్ 6 : విద్యార్థులు అంకితభావంతో, క్రమశిక్షణతో మెదిలితే లక్ష్యాన్ని చేరుకుంటారని సినీ సంగీత దర్శకుడు, పద్మశ్రీ ఎంఎం కీరవాణి అన్నారు. హనుమకొండ జిల్లా అనంతసాగర్ శివారు ఎస్సార్ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏరోస్పెస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్షరింగ్ హబ్ సలహాదారు, ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సతీశ్‌రెడ్డి, సినీ సంగీత దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి హాజరయ్యారు. కాగా, కీరవాణీ తెలుగు సినీ పరిశ్రమకు చేసిన విశేష సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. ఎస్సార్‌యూ, చాన్స్‌లర్ వరదారెడ్డి తనకు డాక్టరేట్‌ను ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వరదారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘మౌనంగానే ఎదగమని మొక్కనీకు చెబుతుంది’ అనే పాట పాడి విద్యార్థుల మనుసు దోచుకున్నారు. అయితే, అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చాన్స్లర్లు మధుకర్‌రెడ్డి, మహేశ్, వీసీ దీసక్గార్గ్, డాక్టర్ సతీశ్‌రెడ్డి,అర్యనారెడ్డి, వివిధ విగాధిపతులు పాల్గొన్నారు.