ఖమ్మం, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అభివృద్ధి పనులను అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లిలోని పగిడేరు వాగుపై నిర్మాణంలో ఉన్న లో-లెవల్ బ్రిడ్జి పనులను బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. అకారణంగా పనులు నిలిచిపోవడంతో ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.75 లక్షల పరిపాలనా అనుమతులతో అధికారులు మార్కింగ్ ఇచ్చి పనులను ప్రారంభించగా.. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అధికారులను బెదిరించి కావాలనే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బ్రిడ్జి పనులు కొనసాగితే సస్పెండ్ చేయిస్తామని, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దీంతో ఎవరూ ఇటువైపు తొంగిచూడటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇక్కడి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలే తప్ప అడ్డుకోవడం సరికాదని అన్నారు. గత రెండున్నరేండ్లలో ఈ ప్రభుత్వం సాధించింది ఏమీలేదని విమర్శించారు. చివరకు ప్రజోపయోగకరమైన బ్రిడ్జి పనులను సైతం అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మసలుకోవాలని, లేదంటే ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు. సంబంధిత అధికారులతో తాను మాట్లాడతానని, పగిడేరు వాగు బ్రిడ్జి పనులు పూర్తి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని ఆయన స్థానికులు, రైతులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్ల ద్వారా కాకుండా నేరుగా షాపుల్లో లభించేలా చూడాలని కోరారు.